Sep 25,2023 21:55
  •  చంద్రబాబు పిటిషన్‌పై సుప్రీం చీఫ్‌ జస్టిస్‌

న్యూఢిల్లీ : నిబంధనల నుంచి మినహాయింపునిచ్చి లిస్టులో లేని తమ పిటిషన్‌పై అత్యవసర విచారణ చేపట్టాల్సిందిగా టిడిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసుకున్న విన్నపాన్ని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. అంత అత్యవసరమేంటని ప్రశ్నించిన ధర్మాసనం మంగళవారం నాడు లిస్టులో చేర్చాలని సూచించింది. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కుంభకోణం కేసులో తనపై నమోదైన ఎఫ్‌ఆర్‌లను కొట్టివేయాలంటూ చంద్రబాబు పెట్టుకున్న పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాలని ఆయన తరపు న్యాయవాది సిద్ధార్థ్‌ లూథ్రా కోరారు. 'చంద్రబాబు కస్టడీతో రాష్ట్రంలో ప్రతిపక్షాన్ని తొక్కేస్తున్నారని' పేర్కొంటూ ఈ కేసును అత్యవసరంగా చేపట్టాల్సి వుందని లూథ్రా పేర్కొన్నారు. చంద్రబాబును ఎప్పుడు అరెస్టు చేశారని ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్‌ ప్రశ్నించగా, సెప్టెంబరు 8న అని లూథ్రా చెప్పారు. అటువంటపుడు ఈ రోజునే దీనిపై అత్యవసరంగా విచారణ చేపట్టాల్సిన అవసరం లేదని ప్రధాన న్యాయమూర్తి స్పష్టం చేశారు. మంగళవారం ఈ అంశాన్ని లిస్ట్‌లో పెట్టాల్సిందిగా లూథ్రాకు సూచించారు.

స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ దాఖలు

కాగా చంద్రబాబు తరుపున న్యాయవాది గుంటూరు ప్రమోద్‌ కుమార్‌ స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ (ఎస్‌ఎల్‌పి) దాఖలు చేశారు. రాష్ట్రంలోని అతిపెద్ద ప్రతిపక్షాన్ని తొక్కిపట్టేందుకే పాలక ప్రభుత్వం ప్రతీకారంతో ఎఫ్‌ఐఆర్‌లను నమోదు చేసిందని ఎస్‌ఎల్‌పి పేర్కొంది. 21 మాసాల క్రితం నమోదైన కేసులో నాయుడు పేరును ఎఫ్‌ఐఆర్‌లో అకస్మాత్తుగా చేర్చి..అక్రమంగా అరెస్టు చేశారని తెలిపారు. రాజకీయ కారణాలతోనే ఇవన్నీ జరిగాయని పేర్కొన్నారు.