టి.వి సీరియళ్ళన్నీ కల్పనలే. వాటి లక్ష్యం వినోదమే. ఈ వినోదపు తీరుతెన్నులు, సామాజిక ప్రయోజకత్వం, ప్రత్యేకించి స్త్రీలపై వీటి ప్రభావం రచయిత అవగాహనపై ఆధారపడి ఉంటాయి. శాస్త్రీయ దృక్పథం, సామాజిక స్పృహ బాధ్యతలు లేని రచయితలు సమాజ వినాశక రచనలు చేస్తారు. నిర్మాతలు వాటిని చిత్రీకరిస్తారు. దర్శకులు సహకరిస్తారు. 15 ఏళ్ల క్రితం ఒక మహిళా అధ్యయన సంస్థ నివేదిక ఇలా ఉంది. ''ఉదయం 11 నుండి రాత్రి 11 దాకా కొందరు స్త్రీలు క్రమం తప్పకుండా సీరియళ్ళు చూస్తారు. వారి ప్రవర్తనలో ఊహించని మార్పొస్తుంది. కుటుంబ సభ్యులు, బంధువులు, ఇరుగుపొరుగువారు, స్నేహితులతో సంబంధాల్లో గణనీయమైన మార్పు వస్తుంది. తోటి స్త్రీలతో మనసు విప్పి మాట్లాడే అలవాటు, స్నేహభావం మాయమౌతాయి. సీరియళ్ళ లోని ఆడంబరాలతో తమ స్థితిగతులను పోల్చుకొని న్యూనతాభావం చోటుచేసుకుంటుంది. సీరియళ్ళలో స్త్రీని స్త్రీకి శత్రువుగా చూపిస్తున్నారు. అత్తాకోడళ్ళు, తోడికోడళ్లు, అక్కాచెల్లెళ్లు, ఆడపడుచులు, అమ్మాకూతుళ్లు కొట్లాడుకుంటారు. కుట్రలు పన్నుతారు. మగాడికి ఇద్దరు పెళ్ళాలుంటారు. ఆ మగాడి అమ్మ, లేదా అమ్మాయి అమ్మ వంత పాడతారు. ఆ మగాడి తప్పేమీ లేనట్లు, భార్యలతో భర్త తెగ బాధపడిపోతున్నట్లు, తీవ్ర కష్టనష్టాలు భరిస్తున్నట్లు చూపిస్తారు. గయ్యాళులు కాని స్త్రీలంతా ఏడుస్తూనే ఉంటారు. ఎంత పేరుప్రఖ్యాతులున్నా అవివాహిత మహిళలను నీచులుగా, మగాళ్లను మోసగించేవాళ్లుగా చిత్రిస్తుంటారు. ఇవన్నీ వాస్తవ విరుద్ధాలు. నిజ జీవితానికి దూరమైనవి.
సీరియళ్ళ స్త్రీలలో సౌందర్య పోషణ ఎక్కువన్నట్లు చూపుతారు. 24 గంటలూ అలంకరించుకునే ఉంటారు. కట్టుబొట్టు, అలంకరణ, ఆహార్యం వికారంగా, వెటకారంగా ఉంటాయి. అలాంటి ఆభరణాలు, అలంకారాలు లేని బతుకు సాధారణ స్త్రీలకు దండగనిపిస్తుంది. స్త్రీలు అందంగా ఉండాలన్న భావన కల్పిస్తారు. వారి శారీరక సౌందర్యానికే కాని, వృత్తి, శక్తిసామర్థ్యాలు, వ్యక్తిత్వాలకు విలువనివ్వరు. చదువుకున్న పట్టణ ప్రాంత కోడలు గ్రామీణ ప్రాంత తోడికోడలిని రాచిరంపాన పెడుతుంది. సీరియళ్ళలో శారీరక శ్రమకు విలువ ఉండదు.
కథకు అవసరమైతే తప్పితే సీరియళ్ళలో కామన్‌మ్యాన్ కనపడడు. అంతా ధనవంతులే. ఇళ్ళు రాజభవనాలే. మానవ సంబంధాలను అమానవీకరిస్తారు. లింగవివక్ష కన్పిస్తుంది. మోసాలు, హత్యలు, క్షుద్రపూజలు ప్రదర్శిస్తారు. పూజలు, ఆచారాలు, యజ్ఞయాగాలు, క్రతువులు, పుట్టినరోజులు, నామకరణాలు, అక్షరాభ్యాసాలు, కర్మకాండలు ఆడంబరంగా చేయిస్తారు. ఆడంబరాలు, గుడ్డినమ్మకాలను పెంచుతున్నారు. సమాజంలో సగమైన మహిళలు సీరియళ్ళ మత్తులో మునిగితే సామాజిక ప్రగతి కుంటుపడి సమాజం వెనకకు నడుస్తుంది.
అరగంట సీరియల్‌లో ఐదు నిమిషాల కథ కూడా నడవదు. కాలమంతా ప్రకటనలతో, జరిగిన కథతో, జరగబోయే కథతో గడిచిపోతుంది. సీరియల్ ఏళ్ల తరబడి సాగుతుంది. వీక్షకుల కాలం వృధా అవుతుంది. వారు ఏమౌతుందోనన్న ఒత్తిళ్లకు లోనవుతూనే ఉంటారు. సీరియళ్ళ నిర్మాతలు విపరీత లాభార్జన పొందుతారు. మంచి సీరియళ్ళు ఉండవు కాని కొన్నింటిలో మంచి అంశాలు ఉంటాయి. ఒక సీరియల్‌లో కొడుకు వదిలేసిన కోడలితో అత్త చాలా ప్రేమగా వ్యవహరిస్తుంది. వీటిని ప్రచారం చేయాలి. ప్రజల్లో సామాజిక స్పృహ, చైతన్యం పెంచటానికి పౌరసంఘాలు కృషి చేయాలి. సీరియళ్ళను స్త్రీలు వినోదాత్మకంగానేకాక విమర్శనాత్మకంగానూ చూడాలి.
- సంగిరెడ్డి హనుమంత రెడ్డి,
ఆల్ ఇండియా ప్రోగ్రెసివ్ ఫోరం జాతీయ కార్యదర్శి,
సెల్ : 9490 20 4545










