Sep 26,2023 16:21

హైదరాబాద్‌ : పేద ప్రజల సంక్షేమం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో చిత్తశుద్దితో పని చేస్తున్నదని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ స్పష్టం చేశారు. మంగళవారం సికింద్రాబాద్‌లోని ఆర్డీవో కార్యాలయంలో లబ్ధిదారులకు ఇండ్ల కేటాయింపు పత్రాలను పంపిణీ చేశారు. అదేవిధంగా వికలాంగులకు పెంచిన పెన్షన్‌కు సంబంధించిన ప్రొసీడింగ్స్‌ను అందజేశారు.ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ.. పేద ప్రజల సొంత ఇంటి కలను సాకారం చేసిన ఘనత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికే దక్కుతుందని చెప్పారు. లబ్ధిదారుడిపై ఒక్క రూపాయి భారం పడకుండా అన్ని సౌకర్యాలతో కూడిన ఇండ్లను నిర్మించిన ఉచితంగా ఇచ్చిన చరిత్ర సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని అన్నారు. పేద ప్రజల కోసమే లక్ష డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్లను ప్రభుత్వం నిర్మిస్తుంటే కొన్ని పార్టీల నాయకులు ఇష్టానుసారంగా మాట్లాడారని, నేడు ఆ ఇండ్లను అర్హులైన పేదలకు పంపిణీ చేస్తుంటే వాళ్ల నోర్లు మూతపడ్డాయని విమర్శించారు.ఎంతో పారదర్శకంగా, ఎలాంటి రాజకీయ జోక్యం లేకుండా లబ్ధిదారులను ఎంపిక చేసి ఇండ్లను పంపిణీ చేస్తున్నట్లు వివరించారు. ఇప్పటికే రెండు విడతలలో 24,900 ఇండ్లను పంపిణీ చేసినట్లు చెప్పారు. అదేవిధంగా దివ్యాంగులకు ఒక భరోసాను కల్పించే విధంగా రూ.3,016 ఉన్న పెన్షన్‌ను ముఖ్యమంత్రి పెద్ద మనసుతో 4016 రూపాయలకు పెంచారని పేర్కొన్నారు. వికలాంగులకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని, వారి అభివఅద్ధికి అవసరమైన చేయూతను అందిస్తుందని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్‌ అనుదీప్‌ దురిశెట్టి, ఆర్డీవో రవి, కంటోన్మెంట్‌ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి లాస్య నందిత, తదితరులు పాల్గొన్నారు.