Oct 14,2023 20:16

ప్రజాశక్తి - ఉక్కునగరం (విశాఖపట్నం) :ఉక్కు పరిరక్షణ పోరాటాన్ని ఉధృతం చేసి కేంద్ర ప్రభుత్వం కళ్లు తెరిపిస్తామని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్‌ డి.ఆదినారాయణ అన్నారు. స్టీల్‌ ప్లాంట్‌ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా కూర్మన్నపాలెం కూడలిలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు శనివారానికి 975వ రోజుకు చేరాయి. దీక్షలో స్టీల్‌ సిఒ అండ్‌ సిసిపి విభాగం కార్మికులు కూర్చున్నారు. వారినుద్దేశించి ఆయన మాట్లాడుతూ లాభాల్లో ఉన్న స్టీల్‌ప్లాంట్‌ను ప్రయివేటువారికి అమ్మేసేందుకు కేంద్రం నిర్ణయం తీసుకున్న క్షణం నుంచి అలుపెరగక పోరాటం చేస్తున్నామన్నారు. తమకు దేశ వ్యాప్తంగా మద్దతు లభించినట్టు తెలిపారు. ఉక్కు ప్రయివేటీకరణకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకునేది తెగేసి చెప్పారు. ప్రజలు, కార్మికుల ఆకాంక్షను గుర్తించి ఇప్పటికైనా కేంద్రం ప్రభుత్వం వెనక్కు తగ్గి స్టీల్‌ప్లాంట్‌ను ప్రభుత్వ రంగంలోనే కొనసాగిస్తామని ప్రకటన చేయాలని డిమాండ్‌ చేశారు. ఇప్పటికీ మిగిలి ఉన్న సుమారు ఎనిమిది వేల మంది ఉక్కు నిర్వాసితులకు శాశ్వత ఉపాధి కల్పించాలని కోరారు. ప్లాంట్‌కు సొంత గనులు కేటాయించాలని డిమాండ్‌ చేశారు. దీక్షలో పోరాట కమిటీ నాయకులు వరసాల శ్రీనివాసరావు, టి.కనకరాజు, కర్రి బాబూరావు, కె.ఆనంద్‌ కుమార్‌, ఎస్‌కె.మొహిద్దిన్‌, కె.సుబ్బారావు, వై.శ్రీనివాసరావు పాల్గొన్నారు.