Oct 01,2023 21:52

ప్రజాశక్తి-ఆరిలోవ, సింహాచలం, గోపాలపట్నం, పెందుర్తి (విశాఖ):విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ఎట్టి పరిస్థితిలోనూ ప్రయివేటుపరం కానివ్వబోమని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె.లోకనాథం స్పష్టం చేశారు. విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం సిపిఎం చేపట్టిన ఉక్కు రక్షణ బైక్‌ యాత్ర 12వ రోజుకు చేరింది. ఆదివారం ఆరిలోవలో ప్రారంభమై యాత్ర తోటగరువు, బిఎన్‌ఆర్‌.నగర్‌, డెయిరీఫాం, ఆదర్శనగర్‌, రవీంద్రనగర్‌, టిఐసి పాయంట్‌, దుర్గాబజార్‌, రామకృష్ణాపురం, సింహాచలం, గోపాలపట్నం, ఆర్‌ఆర్‌ వెంకటాపురం, అప్పలనరసయ్య కాలనీ, అప్పన్నపాలెం, వేపగుంట, కృష్ణరాయపురం, పురుషోత్తపురం మీదుగా చినముసిడివాడ వరకు యాత్ర సాగింది. ఆయా ప్రాంతాల్లో జరిగిన సభల్లో లోకనాథం మాట్లాడుతూ.. ఈ నెల 5న కూర్మన్నపాలెం జంక్షన్‌లో నిర్వహించే ముగింపు సభకు ప్రజలు కుటుంబాలతో తరలిరావాలని కోరారు. స్టీల్‌ప్లాంట్‌లాంటి ప్రభుత్వరంగ సంస్థలు విశాఖపట్నంలో ఉండబట్టే గ్రామీణ ప్రాంతం నుంచి పొట్టచేతపట్టుకొని విశాఖ వలసలు వచ్చిన అనేక మందికి పర్మినెంట్‌, కాంట్రాక్టు ఉద్యోగాలు లభించాయని తెలిపారు. ఆటో, ముఠా, తోపుడుబండ్లు, మున్సిపల్‌, షాప్స్‌, హాస్పిటల్స్‌లో ఉపాధి దొరుకుతోందన్నారు. ఈ పరిశ్రమలు ప్రయివేటుపరమైతే ఉత్తరాంధ్ర మరింత వెనుకబాటుకు గురవుతుందని తెలిపారు. విశాఖ ఉక్కు ప్రయివేటుపరం కాలేదని బిజెపి ఎంపి జివిఎల్‌.నర్సింహారావు చెప్పడంకాదని, దీనిపై కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్‌ చేశారు. స్టీల్‌ ప్లాంట్‌ అమ్మకం ఆపకపోతే మోడీ ప్రభుత్వానికి ఘోరీ కడతామని హెచ్చరించారు. స్టీల్‌ప్లాంట్‌ను కాపాడాల్సిన అధికార వైసిపి ప్రజలను మోసగిస్తూ, మోడీ వద్ద మాట్లాడలేకపోతోందని విమర్శించారు. టిడిపి రాష్ట్రంలో అధికారం చేజిక్కించుకోడానికి, వైసిపి తిరిగి అధికారం నిలుపుకోడానికి ఎత్తుగడలు వేస్తున్నాయని, స్టీల్‌ప్లాంట్‌ రక్షణ కోసం ఎటువంటి పోరాటం చేయడం లేదన్నారు. అన్యాయాన్ని ప్రశ్నిస్తానన్న జనసేన పార్టీ మోడీ ముందు సాగిలపడిందని విమర్శించారు. సిపిఎం విశాఖ జిల్లా కార్యదర్శి ఎం.జగ్గునాయుడు మాట్లాడుతూ ప్రజలు, కార్మికుల కోసం ఎర్రజెండా ఎప్పుడూ పోరాటం చేస్తుందని తెలిపారు. యాత్ర సందర్భంగా ఆయాచోట్ల జరిగిన సభల్లో సిపిఎం నాయకులు బి.జగన్‌, ఆర్‌కెఎస్‌వి.కుమార్‌, పి.వెంకటరెడ్డి, బి.ప్రభావతి, బి.వెంకటరావు, బి.రమణి తదితరులు పాల్గొన్నారు.