ఒంగోలు : సిఎం వై.ఎస్.జగన్ తల్లి విజయమ్మకు శుక్రవారం తృటిలో ప్రమాదం తప్పింది. హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గాన విజయమ్మ ఒంగోలుకు వస్తుండగా తెలంగాణ రాష్ట్రం నల్గొండ జిల్లా వాడపల్లి వద్ద ఆమె ప్రయాణిస్తున్న వాహనానికి ముందుగా వెళుతున్న వాహనం నెమ్మదించడంతో డ్రైవర్ ఒక్కసారిగా బ్రేక్ వేశారు. దీంతో అదే వాహన శ్రేణిలోని మరొకటి వెనుక నుంచి వచ్చి విజయమ్మ ఉన్న వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు వెనకభాగం స్వల్పంగా దెబ్బతింది. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న తన సోదరి అత్త, టిటిడి మాజీ ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి తల్లి పిచ్చమ్మను ఒంగోలులో విజయమ్మ పరామర్శించారు. ఆమె రాత్రికి అక్కడే బస చేసి శనివారం ఉదయం తిరిగి హైదరాబాద్‌కు బయలుదేరనున్నారు.










