6 దశల్లో వెరిఫికేషన్ : పది, ఇంటర్ విద్యార్థులకు రెవెన్యూశాఖ నుంచి ఇన్‌కం సర్టిఫికెట్ల జారీ
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : ఆదాయ సర్టిఫికెట్లు మంజూరు సులభతరం చేస్తూ రెవెన్యూశాఖ సోమవారం మార్గదర్శకాలు విడుదల చేసింది. పాఠశాల అడ్మిషన్లు, స్కాలర్‌షిప్పులు, సంక్షేమ పథకాలు, ఫీజు మినహాయింపులు వంటి ప్రయోజనాల కోసం బిపిఎల్‌ను నిర్ధారించేందుకు మంజూరు చేసే ఇన్‌కమ్ సర్టిఫికెట్స్ గురించి ప్రభుత్వం మరోసారి సూచనలు చేసింది. బిపిఎల్ నిర్ధారణకు తెల్లరంగు రేషన్‌కార్డు సరిపోతుందని పేర్కొన్నప్పటికీ ఆయా పాఠశాలలు, కళాశాలలు, సంక్షేమ పథకాల కోసం దరఖాస్తు చేసిన సమయాల్లో ఇన్‌కమ్ సర్టిఫికెట్స్ ఎప్పటికప్పుడు అడుగుతున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. గత రెండేళ్లలో ఇటువంటి సర్టిఫికెట్లు సుమారు 75 లక్షల వరకు ఇచ్చినట్లు గణాంకాలు సూచిస్తున్నాయి. ఆదాయ ధ్రువీకరణ పత్రాల మంజూరుకు సంబంధించి సమస్యలు పరిష్కరించేందుకు సంబంధిత విభాగాధిపతులతో ప్రభుత్వం తాజాగా ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసింది. సమావేశంలో వచ్చిన ఫీడ్ బ్యాక్‌ను బట్టి నూతనంగా సంబంధిత అధికారులకు ప్రభుత్వం సూచనలు చేసింది. పదో తరగతి, ఇంటర్మీడియట్ విద్యార్థులకు రెవెన్యూశాఖ నేరుగా ఆదాయ సర్టిఫికెట్లు మంజూరు చేయనుంది. రాష్ట్ర ఫ్రభుత్వ సంక్షేమ శాఖలైన సోషల్ వెల్ఫేర్ డిపార్టుమెంట్, (బిసి వెల్ఫేర్, మైనార్టీ, ట్రైబల్‌తోపాటు మిగిలిన వెల్ఫేర్ డిపార్టుమెంట్లు) నుంచి రాయితీల కోసం ప్రత్యేకంగా ఇన్‌కమ్ సర్టిఫికెట్ తీసుకోవాల్సిన అవసరం లేదని ఉత్తర్వుల్లో పేర్కొంది. సర్టిఫికెట్ల విషయంలో గ్రామ, వార్డు సచివాలయాలశాఖ ఆధార్ నెంబరు లింకేజీతో 6 దశల్లో విచారించిన అనంతరం అప్లికేషన్‌ను ప్రాసెసింగ్‌లో అనుసంధానిస్తుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ఇడబ్ల్యుఎస్ సర్టిఫికెట్, కేంద్ర ప్రభుత్వ సంబంధిత అవసరాలు, జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం వంటి నిర్ధిష్ట కేసుల్లో ఇప్పుడు సర్టిఫికెట్లు జారీ చేసే పద్ధతి కొనసాగుతుందని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఏదైనా కొత్త అవసరాలు, లేక మినహాయింపులు విషయంలో సంబంధితశాఖ రెవెన్యూ (భూములు) సమ్మతిని తీసుకోవాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో సూచించింది. అన్ని విభాగాల అధిపతులు, సంస్థలు, సొసైటీలు, కార్పొరేషన్లు సూచనలు పాటించేలా చూడాలని జిల్లా కలెక్టర్లు, తహశీల్దార్లకు సూచించాలని పేర్కొంది.










