ప్రజాశక్తి-వెంకటగిరి (తిరుపతి జిల్లా) : తిరుపతిలోని వెంకటగిరి గ్రామదేవత పోలేరమ్మ జాతర జన జాతరగా మారింది. అమ్మవారి ఊరేగింపుతో రాజావీధి దద్దరిలింది. బుధవారం అర్ధరాత్రి కుమ్మరివీధి నుంచి అమ్మవారిగుడి వరకు ఊరేగింపు కొనసాగింది. సంప్రదాయం ప్రకారం వెంకటగిరి రాజాలు అమ్మవారికి సారే అందజేశారు. వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురమల్లి రామ్‌కుమార్‌రెడ్డి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. వెంకటగిరి రాజాలు అమ్మవారికి పూజాసామగ్రిని అందజేశారు. గురువారం సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో అమ్మవారిని ప్రత్యేక రధంపై ఊరేగిస్తూ రాజావీధి, కాశీపేట, శివాలయంవీధి మీదుగా మల్లమ్మగుడి వరకు తీసుకెళ్లి నిమజ్జనం చేశారు. వెరకటగిరిరాజా కుటుంబీకులు సాయికృష్ణ యాచేంద్ర, సర్వజ్ఞకుమార యాచేంద్ర రాజానగిరి నుండి అమ్మవారిని దర్శించుకున్నారు. జాతరను రాష్ట్ర పండుగగా ప్రకటించడంతో ఈసారి విఐపిల తాకిడి ఎక్కువైంది. విఐపిలతో పాటు 50 మందిపైనే అనుచరులు దర్శనానికి రావడంతో యాత్రికులు ఒకింత ఇబ్బంది పడ్డారు. జాతరలో పలువురు దాతలు తమ దాతృత్వాన్ని చాటుకున్నారు.










