Sep 19,2023 15:25

హైదరాబాద్‌ : మహిళా బిల్లుకు కేంద్ర కేబినేట్‌ ఆమోదం తెలపడం శుభపరిణామమని వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిలా రెడ్డి పేర్కొన్నారు. మహిళా రిజర్వేషన్‌ బిల్లు పార్లమెంటులో ప్రవేశపెట్టే చారిత్రక ఘట్టానికి ఒక్క అడుగు దూరంలో ఉన్నామన్నారు. జనాభాలో సగభాగమైన మహిళలు సమాన హక్కు పొందే రోజు కోసం ఎదురుచూస్తున్నానన్నారు. ఈ ఎన్నికల సమయంలో ఈ బిల్లు ప్రవేశపెట్టడంపై ప్రజల్లో అనుమానాలున్నాయన్నారు. రాజకీయ అవకాశవాదం కోసం కాకుండా ప్రజా శ్రేయస్సు కోసం పని చేయాలని షర్మిల అన్నారు. ఈ బిల్లు ప్రవేశపెట్టడానికి మోడీ ప్రభుత్వం ఇంత సమయం తీసుకోవడం బాధాకరమన్నారు. బిల్లు ఆమోదంలో రాజకీయ పార్టీలకు, రాజకీయ నాయకులకు ఈ బిల్లును రాజకీయ అవకాశవాదంగా ఉపయోగించవద్దని షర్మిల సూచించారు. బిల్లు ముఖ్య ఉద్దేశ్యం దెబ్బతినే అవకాశముంది. దశాబ్దాలుగా పోరాడుతున్న మహిళా రిజర్వేషన్‌ బిల్లుకు.. రాజకీయాలకు అతీతంగా మనస్ఫూర్తిగా అందరం మద్దతిద్దామని వైఎస్‌ షర్మిల పేర్కొన్నారు.