చెన్నూరు (మంచిర్యాల) : గురుకులంలో వేధింపులు తట్టుకోలేక అధ్యాపకురాలు చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన సోమవారం మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో జరిగింది.
చెన్నూరు పట్టణ సిఐ వాసుదేవరావు కథనం మేరకు ... కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం బమ్మనపల్లికి చెందిన తిరుమలేశ్వరి (39) చెన్నూరు పట్టణంలోని ఆదర్శనగర్‌లో నివాసముంటున్నారు. చెన్నూరులోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో నాలుగేళ్లుగా జూనియర్ లెక్చరర్‌గా పనిచేస్తున్నారు. ఈ నెల ఒకటో తేదీ నుంచి ప్రిన్సిపల్ ఆమెకు మెస్ కేర్‌టేకర్‌గా అదనపు బాధ్యతలిచ్చారు. వాటితో పని ఒత్తిడి ఎక్కువయ్యిందని, మెస్‌కు సంబంధించిన అంశాల్లో ప్రిన్సిపల్ రాజమణి సహా కొందరు ఉపాధ్యాయులు వేధిస్తున్నారంటూ తిరుమలేశ్వరి తన భర్త సంపత్‌తో చెబుతూ ఉండేది. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం 6 గంటల సమయంలో తిరుమలేశ్వరిని భర్త గురుకులం వద్ద దింపి వెళ్లాడు. రెండు గంటల తర్వాత భార్యకు ఫోన్ చేశాడు. అయితే తన భార్య ఫోన్ ఇతరులు మాట్లాడి ... పెద్దచెరువు ఒడ్డున బ్యాగు ఉందని చెప్పడంతో హుటాహుటిన అక్కడికి వెళ్లాడు. చెరువులో భార్య అచేతనంగా పడి ఉండగా ఆసుపత్రికి తరలించాడు. అప్పటికే ఆమె మఅతిచెందిందని డాక్టర్లు నిర్ధారించారు.
ఈ విషయమై సిఐ మాట్లాడుతూ ... తిరుమలేశ్వరి భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు మఅతురాలి ఫోన్‌ను పరిశీలించామన్నారు. అందులోని వాయిస్ రికార్డులో ప్రిన్సిపల్ రాజమణి, అసిస్టెంట్ కేర్ టేకర్ స్రవంతి, పీఈటీ రేష్మ, సహ ఉపాధ్యాయులు శిరీష, పుష్పలతల వేధింపుల వల్లనే తాను ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ తిరుమలేశ్వరి తెలిపిందన్నారు. ఈ మేరకు అయిదుగురిపై కేసు నమోదు చేశామన్నారు. మఅతురాలికి పదకొండేళ్ల కుమార్తె ఉందని తెలిపారు.
మృతురాలి భర్త మాట్లాడుతూ ... నిబంధనల ప్రకారం జూనియర్ లెక్చరర్లను మెస్ కేర్‌టేకర్‌గా నియమించకూడదని, అయినా బలవంతంగా తనపై బాధ్యతలు రుద్దారని తిరుమలేశ్వరి తనతో చెప్పిందని అన్నారు. వేధింపులు భరించలేనంటూ చాలాసార్లు కన్నీళ్లు పెట్టుకుందని అన్నారు. ఆదివారం సాయంత్రం తాను ఇదే విషయం ప్రిన్సిపల్‌తో మాట్లాడాననీ.. ఆ బాధ్యతలనుంచి తన భార్యను తప్పించాలని విన్నవించానని తెలిపారు. ప్రిన్సిపల్ దానికి నిరాకరించడంతోపాటు చెప్పిన పని చెయ్యాల్సిందేనని తేల్చిచెప్పారని మఅతురాలి భర్త సంపత్ ఆవేదన వ్యక్తం చేశారు.










