Oct 29,2022 13:45

న్యూఢిల్లీ : టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌ న్యాయస్థానం విధించిన గడువులోపే ట్విట్టర్‌ను కొనుగోలు చేసి పగ్గాలు చేపట్టారు. ఆయన ట్విటర్‌ యజమానిగా బాధ్యతలు తీసుకున్న వెంటనే.. సిఇఓ పరాగ్‌ అగర్వాల్‌, ఆర్థిక నిర్వహణాధికారి (సిఎఫ్‌ఒ) నెడ్‌ సెగల్‌, న్యాయ వ్యవహారాల విభాగ అధిపతి విజయ గద్దెలను కంపెనీ నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే కంపెనీ నుంచి వారిని తొలగించినా.. నిబంధనల ప్రకారం కంపెనీ నుంచి లభించే ఆర్థిక లబ్ధి చేకూరుతుందని మీడియా వర్గాలు పేర్కొంటున్నాయి. బ్లూమ్‌బర్గ్‌ లెక్కల ప్రకారం.. ట్విట్టర్‌ సిఇఓగా ఉన్న పరాగ్‌ అగర్వాల్‌ 50 మిలియన్‌ డాలర్లు, నెడ్‌ సెగల్‌ 37, విజయ గద్దె 17 మిలియన్‌ డాలర్లు అందుకోనున్నారు. ట్విటర్‌ కీలక బాధ్యతల్లో వున్న ఈ ముగ్గురూ దాదాపు 100 మిలియన్‌ డాలర్లతో కంపెనీ నుంచి నిష్క్రమించనున్నారని బ్లూమ్‌బర్గ్‌ వెల్లడించింది.
కంపెనీ నిబంధనల ప్రకారం.. ఉద్యోగస్తులు ఆ కంపెనీలో ఉద్యోగాల్ని కోల్పోతే.. ఒక సంవత్సరం జీతంతో పాటు, ఏడాదిపాటు ఆరోగ్యబీమా కూడా వర్తిస్తుంది. ఈ నిబంధనలు.. ట్విట్టర్‌ కంపెనీ నుంచి నిష్క్రమించిన అగర్వాల్‌, నెడ్‌ సెగల్‌, విజయ గద్దెలకు కూడా వర్తిస్తాయని బ్లూమ్‌బర్గ్‌ పేర్కొంది.