హైదరాబాద్ : హైదరాబాద్ నెహ్రూ జంతు ప్రదర్శనశాలలో శనివారం విషాద ఘటన జరిగింది. ఇక్కడ ఏనుగుల శాలలో సంరక్షకుడిగా పనిచేస్తున్న షాబాజ్ (22)ను విజరు అనే ఏనుగు తొక్కి చంపింది.
జూపార్కు డైరెక్టర్ ప్రసాద్, క్యూరేటర్ సునీల్, డిప్యూటీ డైరెక్టర్ నాగమణి వివరాల మేరకు ... జూపార్కు ఏర్పాటయ్యి 60 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ... గత శనివారం ఉత్సవాలు నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో పాల్గన్న షాబాజ్ అనంతరం ఇంటికి వెళ్లేముందు ఏనుగుల గదిలో ఉంచిన తన దుస్తుల కోసం వెళ్లాడు. ఆ సమయంలో విజరు అనే ఏనుగు షాబాజ్‌ను తొండంతో లాక్కొని విసిరికొట్టింది. ఏనుగు పెద్దగా అరుస్తూ అతడిపై దాడి చేయడంతో సమీపంలో ఉన్న జంతు సంరక్షకులు అప్రమత్తమై వెంటనే అక్కడకు చేరుకొని చూసేసరికి షాబాజ్ అచేతన స్థితిలో పడి ఉన్నాడు. వెంటనే బ్యాటరీ వాహనంలో ఏనుగు నివాసం నుండి బయటకు తెచ్చి అంబులెన్సులో డీఆర్‌డీవో అపోలో ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ నిన్న సాయంత్రం 4 గంటల సమయంలో షాబాజ్ మృతి చెందాడు. మఅతదేహాన్ని చూస్తే ఏనుగు కాళ్లతో తొక్కినట్టుగా అనిపిస్తోందని జూ అధికారులు తెలిపారు. షాబాజ్ తండ్రి కూడా ఈ జూలోనే పనిచేసేవారని, ఆయన మూడేళ్ల క్రితం చనిపోవడంతో.. కారుణ్య నియామకం కింద షాబాజ్ ఈ ఉద్యోగంలో చేరాడని జూ అధికారులు తెలిపారు. ఇక్కడి జూ పార్కులో జంతువు దాడిలో సంరక్షకుడు మరణించడం ఇదే తొలిసారి అని అన్నారు.










