Oct 14,2023 08:45

ప్రజాశక్తి-అమరావతి, అమరావతి బ్యూరో : ఎస్‌ఐ నియామక అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు తిరిగి నిర్వహించాలని పోలీసు రిక్రూట్‌ మెంట్‌ బోర్డుకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. డిజిటల్‌ మీటర్‌ సాయంతో కాకుండా పాత పద్ధతిలో మాన్యువల్‌గా ఎత్తు, ఛాతీ పరీక్షలు నిర్వహించాలని పేర్కొంది. 2019లో మాన్యువల్‌గా పరీక్ష నిర్వహించినప్పుడు అర్హత సాధించి, 2023లో అనర్హులైన అభ్యర్థులు పిటిషన్‌ దాఖలు చేసిన నేపథ్యంలో... ఆ 95 మందికి ఎత్తును తిరిగి కొలవాలని, ఈ ప్రక్రియ మూడు రోజుల్లో పూర్తి చేయాలని జస్టిస్‌ వి సుజాత శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 14, 15 తేదీల్లో మెయిన్స్‌ యథాతథంగా నిర్వహించాలని, అర్హత సాధించిన వారిని తదుపరి దశకు అనుమతించాలని ఆదేశించారు. హైకోర్టు అనుమతి నేపథ్యంలో ఈ నెల 14, 15 తేదీల్లో ఎస్‌ఐ మెయిన్స్‌ పరీక్షలు ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, తిరిగి మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు నిర్వహించనున్నారు.