బ్రిజ్ భూషణ్ అరెస్టుకు 9 వరకూ గడువు : లేకపోతే దేశవ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని రైతు నేతలు హెచ్చరిక
- రెజ్లర్లకు 1983 క్రికెట్ ప్రపంచ కప్ గెలిచిన జట్టు మద్దతు
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : డబ్ల్యుఎఫ్‌ఐ చీఫ్, బిజెపి ఎంపి బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ ను అరెస్టు చేసేందుకు జూన్ 9 గడువు వరకు రైతు నేతలు గడువు విధించారు. లేకపోతే దేశవ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. శుక్రవారం హర్యానా, పంజాబ్, రాజస్థాన్ మరియు ఉత్తరప్రదేశ్ సహా వివిధ ప్రాంతాల నుండి వివిధ ఖాప్‌లు, రైతుల సంఘాల ప్రతినిధులు హర్యానాలోని కురుక్షేత్రలో జాట్ ధర్మశాలలో సమావేశం అయ్యారు. మైనర్‌తో సహా మహిళా రెజ్లర్లపై బ్రిజ్ భూషణ్ లైంగికంగా వేధిస్తున్నాడని ఆరోపించిన రెజ్లర్‌లకు సంఘీభావం తెలుపుతూ రైతు సంఘాలు ఉత్తరప్రదేశ్‌లో ''ఖాప్ మహాపంచాయత్'' పంజాబ్, హర్యానాలో వరుసగా నిరసనలు జరిగాయి.
రైతు నేత రాకేష్ టికాయిత్ మాట్లాడుతూ ''ఈ అంశంపై చర్చను ప్రారంభించడానికి మేము ప్రభుత్వానికి జూన్ 9 వరకు సమయం ఇస్తున్నాము. జూన్ 9 తరువాత, ఈ కుమార్తెలకు (మహిళా రెజ్లర్లు) మద్దతుగా దేశవ్యాప్తంగా ప్రదర్శనలు, పంచాయితీలు నిర్వహిస్తాం''అని అన్నారు. ''వారి (మల్లయోధుల) కుటుంబాలకు బెదిరింపులు వస్తున్నాయి. కాబట్టి వారికి భద్రత కల్పించాల్సిన అవసరం ఉంది'' అని పేర్కొన్నారు. బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌ను అరెస్ట్ చేయాలని, లేదంటే నిరసనలు ఎదుర్కోవాలని కేంద్రాన్ని హెచ్చరించారు.
రెజ్లర్లకు 1983 క్రికెట్ ప్రపంచ కప్ విజేత జట్టు
1983 క్రికెట్ ప్రపంచ కప్ గెలిచిన జట్టు నిరసనకారులకు మద్దతు ఇస్తుందని, వారి మనోవేదనలను తప్పనిసరిగా పరిష్కరించాలని పేర్కొంది. నిరసన తెలిపిన మల్లయోధులపైచర్య హృదయ విదారకమైనది. భయంకరమైనది' అని పేర్కొంది. 1983 క్రికెట్ ప్రపంచ కప్ విజేత జట్టులో భాగమైన శ్రీకాంత్ మల్లయోధులు భౌతిక దాడి చేయబడిన దృశ్యాలను చూడటం 'హృదయ విదారకంగా, భయంకరంగా ఉంది'' అని అన్నారు.
రెజ్లర్లకు వీలైనంత త్వరగా న్యాయం చేయాలి: మాజీ క్రికెటర్ కీర్తి ఆజాద్
మాజీ భారత క్రికెటర్ కీర్తి ఆజాద్ నిరసన తెలిపిన రెజ్లర్లకు మద్దతుగా నిలిచారు. తమ క్రీడా విజయాలతో దేశానికి గౌరవం తెచ్చిన రెజ్లర్లకు న్యాయం చేయాలని ఆందోళనకు దిగడం దారుణమని అన్నారు.
బ్రిజ్ భూషణ్‌కు షాక్
లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటోన్న బ్రిజ్ భూషణ్ కు ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం షాకిచ్చింది. ఆయన సోమవారం అయోధ్యలో నిర్వహించ తలపెట్టిన ర్యాలీ వాయిదా పడింది. తనకున్న మద్దతును చూపించుకునేందుకు ఈ ర్యాలీని నిర్వహించాలనుకున్నారు. కాగా, వాయిదా విషయాన్ని బ్రిజ్ భూషణ్ ఫేస్‌బుక్ ప్రకటన ద్వారా వెల్లడించారు. జూన్ 5న సాధువుల ఆశీస్సులతో 'జన చేతన్ మహార్యాలీ'ని నిర్వహించాలనుకున్నాను. అయితే ప్రస్తుతం నాపై నమోదైన కేసును దర్యాప్తు చేస్తున్నారు. అలాగే సుప్రీంకోర్టు ఆదేశాలను గౌరవిస్తూ కొన్ని రోజుల పాటు దీనిని వాయిదా వేస్తున్నాను అని అన్నారు. అయితే ర్యాలీకి యుపి ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదని, అందుకే వాయిదా వేసినట్లు సమాచారం.










