ప్రజాశక్తి-నెల్లూరు ప్రతినిధి : ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేసే కమ్యూనిస్టులను కొనేవారు ఇప్పటి వరకు పుట్టలేదని, ఇక పుట్టరని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో టిడిపి, వైసిపి మధ్య రాజకీయ విభేదాలున్నాయని, ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారన్నారు. నీతి, నిజాయతీపరులైన కమ్యూనిస్టులపై విమర్శలు చేయడం మంచి పద్ధతి కాదన్నారు. కమ్యూనిస్టులకు సజ్జల రామకృష్ణారెడ్డి వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. గ్రామస్థాయి నుంచి జిల్లా, రాష్ట్ర, దేశ, ప్రపంచ వ్యాప్తంగా కమ్యూనిస్టులు ఎన్నో త్యాగాలు చేశారని చెప్పారు సిద్ధాంతాలు, త్యాగాలు, నిబద్ధతకు కమ్యూనిస్టులు కట్టుబడి పనిచేస్తున్నారన్నారు. ప్రపంచ వ్యాపితంగా ప్రజల కోసం పోరాటం చేసే కమ్యూనిస్టులను ఇష్టం వచ్చినట్లు మాట్లాడాన్ని తాను తీవ్రంగా ఖండిస్తున్నానని తెలిపారు.










