Sep 25,2023 13:08

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : జీవనాధారంగా ఉన్న తమ భూములను కృషి విజ్ఞాన కేంద్రం ఏర్పాటుకు ఇవ్వొద్దని సిపిఎం జిల్లా నాయకులు అర్‌.రాములు, చినచామలపల్లి గ్రామ గొర్రెలు, మేకలు పెంపకందార్లు డిమాండ్‌ చేస్తున్నారు. సోమవారం కృషి విజ్ఞాన కేంద్రానికి భూములు ఇవ్వడాన్ని నిరసిస్తూ ... జిల్లా కలెక్టర్‌ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాను ఉద్దేశించి వారు మాట్లాడుతూ ... దత్తిరాజేరు మండలం, చినచామలాపల్లి గ్రామ గొర్రెలు, మేకల పెంపకం వృత్తిదారులమని, ఈ వృత్తియే జీవనంగా బతుకుతున్నామని అన్నారు. గ్రామ సర్వే నెంబర్లు 1,2,3,100,101లలో ఉన్న డి-పట్టా,సాగులో ఉన్న కొండపోరంబోకు, బంజరు, ఫారెస్టు డిపార్ట్మెంటువారు మొక్కలు వేయించి తమ గ్రామానికి అప్పగించిన తోటతో కలిపి సుమారు 50 ఎకరాల భూమిని తాము సాగుచేసుకుంటూ, జీవాలను మేపుకుంటూ బతుకుతున్నామన్నారు. మొత్తంగా 150 కుటుంబాలు వృత్తిదార్లం ఈభూమిపై పూర్తిగా ఆధారపడి జీవిస్తున్నామన్నారు. అయితే ఇటీవల ప్రభుత్వం ''కృషి విజ్ఞాన కేంద్రం'' ఏర్పాటుకు ఈ 50ఎకరాల భూమిని తీసుకుంటుందని మండల రెవెన్యూ అధికారులు తెలియజేశారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ భూమి చుట్టూఉన్న జీరాయితీ భూముల యజమానులు ఇనుప కంచెలు వేసుకొని వ్యవసాయం చేసుకుంటున్నారన్నారు. తమకు ఉన్న ఈ 50ఎకరాల భూమిని తామంతా కోల్పోతే కనీసం మరుగుదొడ్ల సౌకర్యంనకు కూడా నోచుకోలేమని వాపోయారు. తమ వృత్తిని కాపాడడానికి 25 ఎకరాల భూమిని కేటాయించాలనే ప్రభుత్వ జీవోలు కూడా వర్తింపకుండా ఉందని చెప్పుకున్నారు. తమకు జీవనాధారం లేకుండా చేయకూడదని అందుకు కృషివిజ్ఞాన కేంద్రంనకు తమ భూములు తీసుకోకూడదని జిల్లా యంత్రాంగం వెంటనే స్పందించి తమ కుటుంబాలు రోడ్డున పడకుండా చూడాలని కోరారు. ఈ ధర్నా లో జి.తిరుపతిరావు, మజ్జి శ్రీనివాస్‌, జి.సూర్యనారాయణ గొర్రెలు, మేకలు పెంపకందార్లు పాల్గొన్నారు.