Oct 15,2023 12:36

హైదరాబాద్‌ : ఎన్నికల వేళ అభ్యర్థులకు ఓపిక, సంయమనం అవసరం అని తెలంగాణ సిఎం కెసిఆర్‌ అన్నారు. ఆదివారం ఉదయం తెలంగాణ భవన్‌కు చేరుకున్న ముఖ్యమంత్రి బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కెసిఆర్‌ మాట్లాడుతూ .... తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి బిఆర్‌ఎస్‌ అభ్యర్థుల స్థానాల్లో కొన్ని చోట్ల మార్పులు చేర్పులు చేయాల్సి వచ్చిందని అన్నారు. వేములవాడలో వాస్తవానికి మార్చాల్సిన అవసరం లేదని, న్యాయపరమైన అంశాల వల్ల వేములవాడలో మార్చామన్నారు. మార్పులు, చేర్పులు అన్నీ సానుకూలంగా జరిగాయన్నారు. '' ఎన్నికల వేళ కొన్ని కోపతాపాలు ఉంటాయి.. సహజమే. అభ్యర్థులకు ఓపిక, సంయమనం అవసరం. నామినేషన్ల విషయంలో అజాగ్రత్త వద్దు '' అని కెసిఆర్‌ సూచించారు. నేడు, రేపు ఒక్కో అభ్యర్థికి బీ ఫారాలు అందిస్తామన్నారు. '' మన నాయకులపై గతంలో కొన్ని కేసులు పెట్టారు.. మనవాళ్లు గెలిచినా సాంకేతికంగా ఇబ్బంది పెడతారు '' అని కెసిఆర్‌ అన్నారు. వనమా వంటి నాయకుల విషయంలో అలా జరిగిందని గుర్తు చేశారు. సందేహాలు ఉంటే న్యాయ బఅందాన్ని సంప్రదించాలని కెసిఆర్‌ కోరారు. నామినేషన్ల విషయంలో అజాగ్రత్త వద్దు అని సిఎం కెసిఆర్‌ అభ్యర్థులకు సూచించారు. అందరూ నాయకులను కలుపుకుని పోవాలని అన్నారు.