ప్రజాశక్తి, అమరావతి : ఓటర్ల లిస్ట్‌లోని పేర్లపై ఫిర్యాదు అందగానే ఆ వ్యక్తుల ఓట్లను తొలగింపు సులభం ఏమీ కాదని కేంద్ర ఎన్నికల సంఘం హైకోర్టుకు చెప్పింది. ఒక విధానం ఉంటుందని, లిస్ట్‌లోని వాళ్ల పేర్లు తీసేయాలంటూ దరఖాస్తులు రాగానే రొటీన్‌గా తీసేయడానికి వీలుండదని ఈసీ తరఫు న్యాయవాది డిఎస్ శివదర్శన్ చెప్పారు. 5 అంతకంటే ఎక్కువ అప్లికేషన్లు వస్తే వాటిని ముగ్గురుతో కూడిన కమిటీ పరిశీలిస్తుందని వివరించారు. పేర్లను తొలగించాలని కోరుతున్నారో అలా తొలగించే వ్యక్తులకు నోటీసుల జారీ చేసి వివరణ కూడా పొందుతామన్నారు. ఈ వ్యవహారంపై సమగ్ర వివరాలతో అఫిడవిట్ వేయాలని ఈసీకి చీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, జస్టిస్ రావు రఘునందర్‌రావుల డివిజన్ బెంచ్ మంగళవారం ఆదేశించింది. తన నియోజకవర్గంలో పెద్ద సంఖ్యలో ఓట్ల తొలగింపు జరిగిందంటూ పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణను అక్టోబర్ 31కి వాయిదా పడింది.










