ప్రజాశక్తి - పూసపాటిరేగ (విజయనగరం) : విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండల కేంద్రంలోని స్మశాన వాటికలో రూ. 1.10 లక్షల విలువైన దహన సంస్కరణ స్టాండ్ (బల్ల)ను దుండగులు ఎత్తుకుపోయిన ఘటన బుధవారం విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
గ్రామంలో గత సోమవారం ఓ మహిళ మృతి చెందగా, ఆమె మృతదేహాన్ని పట్టుకొని బంధువులు, స్నేహితులు స్మశానానికి వెళ్లారు. స్మశాన వాటికలో దహన సంస్కరణలు చేసే బల్ల లేకపోవడంతో వారంతా అవాక్కయ్యారు. దహన సంస్కరణ బల్ల బోల్టులన్నీ విప్పేసి ఉండడంతో స్మశానంలో చోరీ జరిగిందని గుర్తించారు. మఅతదేహానికి అతి కష్టంపై దహన సంస్కరణలు పూర్తి చేశారు. ఈ విషయమై సాగి సత్యనారాయణ రాజు, బలబద్రుని శ్రీను, మందపాటి.వాసు, తదితరులు మాట్లాడుతూ ... నాలుగు సంవత్సరాల క్రితం బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య స్మశాన వాటికలో ఎన్‌ఆర్‌ఈజీఎస్ వారి నిధులు రూ.4 లక్షలతో నిర్మాణాలు జరిగాయన్నారు. వాటికి అదనంగా మరో రూ. 1.50 లక్షల సొంత నిధులు చేర్చి గదులు ఏర్పాటు చేసుకున్నామన్నారు. దహన సంస్కరణ కోసం తాడేపల్లిగూడెం నుంచి రూ.1.10 లక్షల విలువైన బీడ్ స్టాండ్ ను తెచ్చి స్మశానంలో బిగించామన్నారు. చిల్లరి దొంగలెవరో బల్లను దొంగతనం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. వారం రోజుల్లోపే ఈ అపహరణ జరిగి ఉంటుందని అంచనా వేశారు. స్మశానంలో చోరీ జరిగిందని తెలిసిన గ్రామస్తులంతా ఆశ్చర్యానికి లోనవుతున్నారు. ఈ విషయమై చుట్టుపక్కల ఉన్న స్క్రాప్ దుకాణాల్లో పరిశీలిస్తున్నామని తెలిపారు. దొంగిలించబడిన స్టాండ్ దొరకకపోతే పోలీసులకి ఫిర్యాదు చేస్తామని తెలిపారు.










