- సిపిఎం పోరుయాత్ర బహిరంగ సభలో ఎంఎ గఫూర్
ప్రజాశక్తి- కనిగిరి (ప్రకాశం జిల్లా) : ప్రజాసమస్యలు పరిష్కరించని పాలకులను చొక్కా పట్టుకొని నిలదీయాలని మాజీ ఎమ్మెల్యే, సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎంఎ.గఫూర్ పిలుపునిచ్చారు. నాయకులు ఓట్ల కోసం రూ.పది కోట్లు ఖర్చు చేసి, రూ.100 కోట్లు సంపాదించుకోవాలని చూస్తున్నారు తప్ప, ప్రజా సమస్యలు పట్టించుకోవడం లేదని విమర్శించారు. సిపిఎం పోరుబాట పాదయాత్రలో భాగంగా కనిగిరి పట్టణంలోని పామూరు బస్టాండ్ సెంటర్లో శనివారం జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఓట్లు, పదవుల కోసం అధికార, ప్రధాన ప్రతిపక్ష పార్టీలు పొట్లాడుకుంటున్నాయని, ఆ పార్టీల నాయకులకు ప్రజా సమస్యలు పట్టకపోవడం విచారకరమని అన్నారు. ఓట్ల కోసం కాకుండా ప్రజాసమస్యల పరిష్కారానికి సిపిఎం పోరుబాట పాదయాత్ర నిర్వహిస్తోందని తెలిపారు. వెనుకబడిన జిల్లాగా ప్రకాశం జిల్లాను ప్రకటించడానికి, జిల్లా అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించడానికి ప్రభుత్వానికి అభ్యంతరం ఏమిటో అర్థం కావడం లేదన్నారు. వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణ పనులు ప్రారంభమై 16 సంవత్సరాలైనా నేటికీ పూర్తి కాలేదని, ఈ ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి ప్రవాహం సాగుతోందని, కాంట్రాక్టర్ల ప్రయోజనమే థ్యేయంగా పాలకులు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ప్రజల ఆశలపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి కుమారుడు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి నీళ్లు చల్లారన్నారు. రాష్ట్రాభివృద్ధికి ప్రణాళిక లేకుండా పదవులు కాపాడుకునేందుకే ఆరాటపడుతున్నారని విమర్శించారు. ప్రాజెక్టులు పూర్తయితేనే కరువు పోతుందని, రైతుల ఆత్మలు ఉండవని అన్నారు. అవినీతికి వ్యతిరేకంగా ప్రజలు పోరాడాలని, సమస్యల పరిష్కారానికి ఐక్యంగా ఉద్యమాలని కోరారు. సభకు సిపిఎం కనిగిరి పట్టణ కార్యదర్శి పిసి.కేశవరావు అధ్యక్షత వహించారు. సిపిఎం జిల్లా కార్యదర్శి ఎస్‌డి హనీఫ్, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు జివి.కొండారెడ్డి, కంకణాల ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.


















