భూకబ్జా బకాసురుడా
ప్రజా ఖజానా లూటీ ఘాతకుడా..
విద్య, వైద్యం, ఉపాధి వ్యాపార కుబేరుడా
సంక్షేమ వారసుడా..సంక్షోభకుడా..
దేశ పాలకుడా..! దళారీ పాలకూడా ..! పీడకుడా..!
ప్రశ్నించటమే నేరమా.!?
అడగటమే అన్యాయమా..!?
వ్యతిరేకించటమే శాపమా..?
హక్కులను అడిగితే
ఉక్కు పాదంతో అణిచివేసిన
ఉద్యమిస్తే లాఠీ ఝుళిపించిన
స్వేచ్ఛను కోరితే అరెస్టు చేసిన
అప్రజాస్వామిక విధానాన్ని
ఎదిరించి నిలబడితే బందుక గురిపెట్టిన..
అవినీతి, అక్రమాలు ఎన్నాళ్ళు
ఎన్నేళ్ళని నినదిస్తే బంధించిన..
దౌర్జన్యాన్ని ధిక్కరిస్తే..ఉన్మాదంపై
గొంతు విప్పితే ఉరితాడు బిగించిన
తిరగబడ్డ నాయకులను తొక్కేసినా..
ప్రశ్నించటం ఆగదు!..ప్రశ్న చావదు!
మానవ మేధస్సులో ప్రశ్న
మళ్ళీ జనిస్తుంది.
ప్రజల ఆక్రోశం తరాలు గడిచిన
ఎగిసిపడే కెరటంలా ప్రశ్న జ్వలిస్తుంది.
నిరంకుశ పాలనా వ్యవస్థను దహించి వేస్తుంది..!
ప్రశ్న ప్రజల్లో చైతన్యాన్ని రగిలించి
నూతన ప్రజాస్వామ్యక వ్యవస్థకు
పురుడు పోస్తూ..! స్వేచ్ఛను అన్వేషిస్తూ.!
సమ సమాజ స్థాపన సాధన కోసం
ఎర్ర బావుటాలా.. స్వేచ్ఛ ప్రశ్నై శ్రమిస్తుంది..!
శ్రామిక రాజ్యానికి జీవం పోస్తుంది.
ప్రశ్నించటం ఆగదు!..ప్రశ్న చావదు!
- ఎస్. కె. బాజీ సైదా,
సెల్ : 8897282981










