- కలెక్టరేట్ వద్ద రణ రంగం
- గంటన్నరపాటు రోడ్డు పై బైటాయించిన విద్యార్థినిలు
- విద్యార్థినిలపై దురుసుగా ప్రవర్తించిన పోలీసులు
ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : వసతి గృహాల్లో సమస్యలు పరిష్కారం చేయాలని ధర్నాకు దిగిన విద్యార్థులను, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులపై పోలీసులు జులుం ప్రదర్శించారు. మంగళవారం జిల్లా వ్యాప్తంగా ఉన్న వసతి గృహాల్లో సమస్యలు పరిష్కారం చేయాలని, విద్యా రంగ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టరేట్ ఎదుట ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు ధర్నా నిర్వహించారు. ప్రశాంతంగా జరుగుతున్న ధర్నాకు పోలీసులు కవ్వింపు చర్యలకు దిగారు. అధికారులు ఎవ్వరూ స్పందించి బయటకు రాక పోవడంతో విద్యార్దులు కలెక్టరేట్ ఔట్ గేటు ఎదురుగా ఉన్న రోడ్డుపై రాస్తా రోకోకు దిగారు. దీంతో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా సహాయ కార్యదర్శి డి.రామును.. డిఎస్పీ మాట్లాడుతామని చెప్పి పిలిచి విద్యార్థులతో మాట్లాడి రాస్తారోకో విరమించాలని కోరారు. అదే విధంగా విద్యార్థులతో మాట్లాదెందుకి వెళ్లిన ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా సహాయ కార్యదర్శి రాముని బలవంతంగా అరెస్టుకు పాల్పడ్డారు. దీంతో విద్యార్థులు అరెస్టు చేయడాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో 5 గురు ఎస్‌ఐలు పదులు సంఖ్యలో పోలీసులు బలవంతంగా రోడ్డు మీద రాము షర్ట్ నీ లాగేసి ఈడ్చుకెల్లి వ్యానులో ఎక్కించారు. దీంతో బగ్గుమన్న విద్యార్థులు.వాహనాన్ని అడ్డుకునే ప్రయత్నంలో వాహనానికి అడ్డంగా బైఠాయించారు. ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు రామకృష్ణ, మరి కొంత మంది విద్యార్థులను బలవంతంగా ఈడ్చుకెళ్ళి అరెస్టులు చేశారు. కొంతమంది విద్యార్థులను జీపూలోకి ఎక్కించిన తర్వాత డిఎస్పీ, 2 టౌన్ సిఐలు దాడికి పాల్పడ్డారు. ఇష్టారాజ్యంగా కొట్టి విద్యార్థులకు బూతులు తిట్టారు. 2 టౌన్ సిఐ, ఎస్‌ఐలు విద్యార్థినులను బెదిరించి, భయపెట్టి కేసులు పెడతాం, వీళ్ళ ఫోటోలు తీయండి, రౌడీ ల్లాగ ఉన్నారంటూ , జుత్తు పట్టుకొని లాగేయండి,రాకపోతే తన్ని ఎడ్చుకెళ్తామనీ 2 టౌన్ సిఐ ఆనంద్ నోటికి పని చెప్పారు. అంతే కాకుండా మీడియాలు మీరు కవర్ చేయకుండా ఆగండి వీళ్ళ సంగతి చూస్తామంటూ మీడియాపై సీఐ ఆనంద్, ఎస్‌ఐ మురళి అసహనం వ్యక్తం చేశారు. అదనంగా మహిళా పోలీసులను తీసుకొచ్చి విద్యార్థులను రోడ్డు మీద ఈడ్చుకెళ్ళి అరెస్టులకు పోలీసులు పాల్పడ్డారు.

పోలీసులు తీరుపై ఎస్‌ఎఫ్‌ఐ నాయకురాలు సౌమ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. మీకు ఆడ పిల్లలు లేరా.మీ ఆడవాళ్ళతో ఇలాగే మాట్లాడతారా అంటూ పోలీసులును నిలదీశారు. మేము మా సమస్యలు పరిష్కారం చేయాలని కోరితే పోలీసులు అతిగా వ్యవహరించి అరెస్టులు చేయడం అన్యాయమన్నారు. ప్రభుత్వ విద్యా సంస్థలులో మీ పిల్లలు చదివితే కష్టాలు తెలుస్తోందని పోలీసులు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీస్ స్టేషన్‌లో మీ సంగతి తెలుస్తామంటు పోలీసులు భయపెట్టడానికి ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. అరెస్టు చేసిన విద్యార్థులను ఒకటవ పట్టణ పోలీసు స్టేషన్ కి,మరి కొంత మంది ని గంట్యాడ పోలీస్ స్టేషన్‌కి తరలించారు.

అంతకు ముందు ధర్నాను ఉద్దేశించి జిల్లా సహాయ కార్యదర్శి డి.రాము మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా సంక్షేమ హాస్టల్లో పెరుగుతున్న ధరలకు అనుగుణంగా మెస్ చార్జీలు పెంచాలని కాస్మెటిక్ చార్జెస్ అందించాలని సంక్షేమా హాస్టల్‌కు సొంత భవనాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల టెక్స్ట్ బుక్స్ అందించి మధ్యాహ్నం భోజనం వసతి కల్పించాలన్నారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు సొంత భవనం కల్పించాలని, జీవో నెంబర్ 77 రద్దుచేసి పీజీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ అందించాలన్నారు. పెండింగ్ లో ఉన్న విద్య మరియు వసతి దీవెనలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులను భర్తీ చేయాలని బాలికల హాస్టల్‌లో సానిటరీ ప్యాడ్స్ అందించాలని,జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. హానర్స్ డిగ్రీ విధానాన్ని రద్దు చేసి మూడు సంవత్సరాల డిగ్రీని కొనసాగించాలని గతంలోనే పలుసార్లు అధికారులకు తెలియజేసిన సమస్యల పట్ల ఎటువంటి స్పందన లేదు అన్నారు.తదనంతరం విద్యార్థులంతా రోడ్లపై బైఠాయించి నిరసన తెలియజేశారు . పోలీసులు జులుం చూపించి , అక్రమంగా 35 మంది విద్యార్డులను విద్యార్థి నాయకులను అరెస్ట్ చేశారు .ఈ కార్యక్రమంలోజిల్లా ఉపాధ్యక్షులు సిహెచ్ రామకృష్ణ, వి.చిన్నబాబు, ఏం.సౌమ్య, జిల్లా సహాయ కార్యదర్శి వెంకటేష్, విద్యార్ది నాయకులు 200 పైగా విద్యార్థులు పాల్గొన్నారు.











