Dec 26,2022 08:32

''నీ జీవితానికేం వడ్డించిన విస్తరి'' అని అన్నీ పెట్టి పుట్టినవారి గురించి అంటూంటారు. వారి ప్రభవానికి, ప్రాభవానికి లోటు ఉండదు. తండ్రి ఓ మేరునగధీరుడు. కానీ అలా అన్నీ ఉన్నచోట జననం పొందటం మహా భాగ్యమే ఐనా బంధువులు, మిత్రులు, సమాజం వారిని ఓ కంట కనిపెడుతూనే ఉంటారు. పైకి కనిపించినంతగా వారి జీవితం నల్లేరు మీద నడకలా ఉండదు. వేసే ప్రతి అడుగుని నిశితంగా గమనిస్తుంటారు జనం. తండ్రి పేరు నిలబెట్టాలన్న తపన ఒక పక్క. కనీసం దాన్ని చెడగొట్టకుంటే చాలునన్న జాగ్రత్త ఒక పక్క. తండ్రి గొప్ప పండితుడైతే లాభాలతో పాటు కొన్ని కష్టాలూ ఉంటాయి. వాటినుండి గట్టెక్కి తానేమో నిరూపించుకున్న వారు చాలా కొంతమందే ఉంటారు. అలాంటి వారిలో ఒకరు మధురాంతకం నరేంద్ర. ఆధునిక సీమ కథకుల్లో ఒకరైన మధురాంతకం రాజారాం కుమారుడిగా తన సాహిత్య జీవితాన్ని ప్రారంభించడం సులభమే కావచ్చు. కానీ దాన్ని కొనసాగించడం, అందులో నిలదొక్కుకోగలగడం, పేరు తెచ్చుకోవడం కత్తిమీద సామే! ఐతే దాన్ని ఆయన దిగ్విజయంగా సాధించారు. తన ప్రత్యేక రచనా వరబడితో భళా అనిపించుకున్నారు నరేంద్ర. ఆయన నవల మనోధర్మపరాగం సాహిత్య అకాడెమి అవార్డును గెలుచుకొంది. ఆయన దాదాపు వంద కథలు కూడా రాశారు.
           దేవదాసీల ఆత్మకథలు, జీవిత చరిత్రలు దక్షిణ భారతదేశంలో బాగా వచ్చాయి. వారి జీవితాల్లోకి తొంగి చూసి, పరిశోధించి, అర్థం చేసుకొని చేసిన రచనే మధురాంతకం నరేంద్ర గారి నవల మనోధర్మపరాగం. ముప్ఫైమందికి పైగా దేవదాసీల జీవితాల్లో వారు నటీమణులుగా, గాయకులుగా, కళా ప్రదర్శకులుగా ఎలా ఎదిగారు అన్నది మనం చూడొచ్చు. వారి అనుభవాలనే ఎంతో లయాత్మకంగా చూపించారని డా.కె.ఎస్‌.రావు అంటారు. ఈ నవలలో వారి అస్తిత్వ భారంతో పాటు, వారు దాని ద్వారానే పేరు గడించడం, భవిష్యత్తును చూసుకోవడం చూస్తాం. సంగీతం పత్ల వారి నిబద్దత అపూర్వం. కాని జీవితాలను అలాగే అంగీకరించడం అన్నది వారి విధి అనుకోవడం వల్ల వారి కష్టాలు అలాగే ఉన్నాయి. నవలలోని పాత్రలు తమను సంగీతానికి, నాట్యానికి ఉన్న సంబంధం రీత్యానే చూసుకుంటారు. ఎన్నో సంవత్సరాలు వారిని అమానవీయంగా చూసిన విషయాన్ని నవల తెలియజేస్తుంది. ఎంతో ఆవేశంతో రాసిన ఈ నవలలో వారి జీవితాల్లోకి సాగిన అన్వేషణ చూడొచ్చు, మరీ ముఖ్యంగా కర్నాటక సంగీతంలో వారు చేసిన ప్రయోగాలే ఉదాహరణలు. వారు సంకటస్థితిలో ఉన్న తమ ఆత్మగౌరవానికి ఎలాంటి భంగం రాకుండా సంగీతంలోనే ఆనందాన్ని, ప్రేమను వెదుక్కోవడం చూస్తాం. నిజజీవితంలో ఆస్తులపైన, విలాసవంతమైన సౌకర్యాలపైన వారికి ధ్యాసే ఉండదు. ఎక్కువ పాత్రలు తమ కథనే చెబుతాయి. బ్రాహ్మణ పోషకులకు తాము ఎలా ఉంపుడు కత్తెలుగా ఉన్నామో తెలియజేస్తాయి. ప్రొ.తిరుమలరావు గారన్నట్టు ఈ నవలలో రచయిత ఎక్కడా నీతివాద స్థానాన్ని తీసుకోలేదు. సంఘటనల మధ్య లింకులను కలపడంలో బాధ్యతాయుతంగా చేసారు.
నవలలో ఉన్న పాత్రలను నిజజీవితంలో ఉన్నవారివేనని మనకు తెలిసిపోతుంది. పాఠకులకు ఆ పాత్రలు రోజూ చూసేవారే అన్న స్ప ృహ కలుగుతుంది. శతాబ్దానికి పైగా దేవదాసీలుగా ముద్రపడి నిర్లక్ష్యం చేయబడ్డవారి జీవితాలను చూపుతారు రచయిత. పుస్తకానికి ముందు ఆయనే ఆ మాట చెప్పారు. ఐతే నవలగా మార్చే భాగంలో కొంత కల్పన చేయవలసి వస్తుంది. అప్పుడే నవలలో పట్టు పెరుగుతుంది. జీవితంలో దేవదాసీలపై చాలామందికి ఎవరికి తోచిన అహగాహన వాళ్ళకు ఉంటుంది. వాటికి విరుద్ధంగా నవలలో వారిని కళాకారులుగా, వ్యక్తిత్వం కలవారుగా చూపుతారు. వారిపై గౌరవాన్ని కలిగిస్తారు. వారి చుట్టూ అల్లుకున్న పుకార్లు మొదలైనవాటి ప్రభావం తన పాత్రలపై పడకుండా జాగ్రత్తపడ్డారు రచయిత.
       నవలను చదివిన పాఠకులకు అందులోని కథనం, చిత్తూరు జిల్లా మాండలికంలో దేవదాసీల జీవిత చిత్రణ మనోహరంగా అనిపిస్తుంది. కొంత తమిళ భాష ప్రభావం కూడా కనిపిస్తుంది. ఈ సజీవ పాత్రలను చూస్తుంటే గురజాడ కన్యాశుల్కంలోని మధురవాణి మనకు గుర్తొస్తుంది. దేవదాసీ నాగలక్ష్మి తల్లి కంటే తన తల్లి గొంతు బాగుంటుందని, ఐతే వీళ్ళు పాడడం వల్లే మా అమ్మ ఉన్నత కులంలో పుట్టిన స్త్రీ ఐనందువల్లే కచేరీలలో పాడడం లేదని గాయత్రి పాత్ర అనుకోవడం రచయిత ఎంత సున్నితంగా సంఘటనల్ని చిత్రిస్తారు అర్థమవుతుంది. దేవదాసీల్లో కొందరు బలవంతంగానే వేశ్యలుగా మారడం గురించి కూడా ఆయన పేర్కొంటారు. వాళ్ళు ఎందుకు ఎలా రాజీపడుతున్నారో ఒక పాత్ర ద్వారా చెబుతారు. కుటుంబ స్తీల జీవితాలకంటే దేవదాసీల జీవితాలే నయమని, అందుకే ఫలానా పోషకునితో వెళ్ళిపొమ్మని మూగాంబిక అనే దేవదాసీ అనడం కూడా పాఠకులను ఆలోచింపజేస్తుంది. నవలలో ఇతర ప్రాంతాలకు చెందిన దేవదాసీ గాయకుల గురించి గొప్పగా చెప్పడం చూడొచ్చు. మనుధర్మశాస్త్రం, కామశాస్త్రం కూడా దేవదాసీలు తెలుసుకొని తమ కళలపై వాటి ప్రభావం ఉందని ఒక పాత్ర చెబుతుంది. దేవదాసీల మధ్య ఉండే వైరుధ్యాలను కూడా కొన్ని పాత్రల సంభాషణల్లో చూస్తాము.
           ఆ వికటిత జీవితాల చుట్టూ ఉండే సమాజం, సంబంధాలు, మనుషుల ఆవేశాలు, ఆలోచనలు, ప్రవర్తనను ఎదుర్కొంటూనే తమ మనో నిబ్బరంతో వారు వెదజల్లే హృదయ పరిమళాలనే మనోధర్మ పరాగంగా రచయిత నవలీకరించారు. ఇందుకు వారిపై ఆయనకున్న సానుభూతి, గౌరవం ఈ నవలలో మనం చూడొచ్చు. ఒక మంచి నవలను పురస్కారానికి ఎంచుకున్న సాహిత్య అకాడమీ ఈ నవలను మరింతగా పాఠకుల దగ్గరకు తీసుకుపోతుంది. ఈ సందర్భంగా రచయితకు అభినందనలు.

- జంధ్యాల రఘుబాబు,
98497 53298