ప్రజాశక్తి-అద్దంకి (బాపట్ల) : ఈ నెల 15న ఒంగోలు నుండి ప్రముఖ కథా రచయిత మంచికంటి వెంకటేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో ప్రారంభమైన గ్రంథాలయ ఉద్యమం మంగళవారం అద్దంకికి చేరుకుంది. మద్దిపాడుచేరి మద్దిపాడులో ర్యాలీ నిర్వహించి అద్దంకికి యాత్ర చేరుకుంది. కాటూరి నరసయ్య నిన్నటి రాత్రి ఈ బఅందానికి ఆతిథ్యమిచ్చారు. ఈరోజు ఉదయం 9 గంటల నుండి అద్దంకిలో గ్రంథాలయ ఉద్యమ పాదయాత్ర అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి గ్రంథాలయాన్ని చేరుకుంది. ఈ పాదయాత్రలో రోటరీసంస్థ, సాహితీ మిత్రమండలి, జాషువా కళాపీఠం, జానపద కళాపీఠం, యన్.టి.ఆర్.కళాపరిషత్ బాధ్యులు, నగర ప్రముఖులు, చైతన్య విద్యాలయ ఉపాధ్యాయులు పాల్గన్నారు. గతంలో వారు గ్రంథాలయ ఉద్యమం కోసం మోటర్ సైకిల్ యాత్ర చేసి రాష్ట్రంలోని అన్ని గ్రంథాలయాలను దర్శించి, వాటి స్థితిగతులపై అధ్యయనం చేశారు. ఇప్పుడు ఎనిమిదిమంది చిన్నారులతో మరో గ్రంథాలయ ఉద్యమ యాత్ర సంకల్పించారు. ఈ యాత్ర ఒంగోలు నుండి విజయవాడ వరకు పాదయాత్ర రూపంలో చేరుకోనుంది.
ప్రతి ఇంటిలో పుస్తకాలు ఉండాలని, విద్యార్థులు తరచుగా గ్రంథాలయానికి వెళ్ళి జ్ఞానసముపార్జన చేయాలని, సెల్ ఫోన్ వదలి పుస్తకాలు చదువుకోవాలని, పుస్తకం ఒక మంచి మిత్రుడని ప్లకార్డుల ద్వారా, నినాదాల ద్వారా ఉద్యమ ఆశయాలను తెలియచేశారు. గ్రంథాలయ ఉద్యమ పాద యాత్రికుడు మంచికంటి వెంకటేశ్వర రెడ్డి మాట్లాడుతూ ... ప్రతి పాఠశాలలో గ్రంథాలయాలు ఏర్పాటు చేయాలని, పిల్లలకు పుస్తకాలను అందుబాటులో ఉంచాలని, గ్రంథాలయ ఉద్యమం ద్వారా అక్షరాస్యత పెంచాలని, పుస్తకాల ద్వారా మాత్రమే సాహిత్యం పట్ల అనురక్తి, భాష పట్ల గౌరవం పెరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పుట్టంరాజు శ్రీరామచంద్ర మూర్తి, గాడేపల్లి దివాకర దత్తు, సి.హెచ్.సుగుణరావు, డి.వి.యం.సత్యనారాయణ, నిమ్మరాజు నాగేశ్వరరావు, ఊటుకూరి కృష్ణ సుభాన్, కె.అనిల్ కుమార్, సూరి, డాక్టర్ యు.దేవపాలన, మన్నం.త్రిమూర్తులు, అద్దంకి లెవీ ప్రసాదు, పి.సి.హెచ్.కోటయ్య, చిన్నిమురళీకృష్ణ, చప్పిడి.వీరయ్య, కె.వి.పోలిరెడ్డి, జె.ప్రతాప్, ఓరుగంటి శ్రీనివాసురావు, షేక్.మస్తాన్, కాట్రగడ రవీంద్రబాబు, మహమ్మద్ రఫి, కాటూరి నరసయ్య, పొడపాటి కృష్ణ, అంజాద్ భాష, బత్తుల అంజయ్య, చావలి సుధాకర రావు, నల్లూరి కాంతి, పాలపర్తి జ్యోతిష్మతి, తదితరులు పాల్గొన్నారు.










