Sep 13,2023 20:57
  •  పిండ గర్భధారణ ప్రక్రియ ద్వారా ఒంగోలు జాతి కోడెదూడ జననం

ప్రజాశక్తి-నాగులుప్పలపాడు (ప్రకాశం జిల్లా) : ఒంగోలు జాతి జన్యు పరిరక్షణ లక్ష్యంగా ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలంలోని చదలవాడ పశుఉత్పత్తి క్షేత్రం పశువైద్యులు చేపట్టిన ప్రయోగం విజయవంతమైనట్లు క్షేత్రం డీడీ బి.రవి తెలిపారు. ట్రాన్స్‌పజైనల్‌ ఆల్ట్రాసౌండ్‌ గైడెడ్‌ ఒవెమ్‌ పికప్‌, ఇన్విట్రో ఫెర్టిలైజేషన్‌ ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్‌ టెక్నాలజీతో గత ఏడాది నవంబరులో బొల్లాపల్లి శ్రీలక్ష్మినరసింహస్వామి దేవస్థానం గోశాలలోని (అద్దె గర్భం సరోగసి) మేలురకం ఒంగోలు జాతి పిండాన్ని తీసుకుని గర్భధారణ ప్రక్రియను చదలవాడ పశుఉత్పత్తి క్షేత్రంలోని పశువైద్యులు విజయవంతంగా చేపట్టారు. తద్వారా ఆవు గర్భం దాల్చి మంగళవారం రాత్రి మేలుజాతి ఒంగోలు కోడెదూడకు జన్మనించింది. కోడెదూడను పశుసంవర్దక శాఖ ఉపసంచాలకులు డాక్టరు రమేష్‌, సహాయ సంచాలకులు డాక్టరు పద్మావతి, డిడి రవి, పశువైద్యులు సోమశేఖర్‌, విజయకుమార్‌రెడ్డి, మాధవీలత బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా చదలవాడ పశుఉత్పత్తి క్షేత్రం కార్యనిర్వణాధికారి శ్రీనివాసరావు, గుంటూరు లాం పశుపరిశోధన సంస్థ శాస్త్రవేత్త ముత్తమరావు మాట్లాడుతూ.. మేలుజాతి పశువులను తక్కువ సమయంలో వృద్ధి చేయడానికి ఐవిఎఫ్‌ఇటి ప్రయోగం అనుకూలమైన పద్ధతి అని తెలిపారు. ఈ విధానాన్ని ఆంధ్రప్రదేశ్‌ పశుగణాభివృద్ధి సంస్థ, శ్రీవెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం సంయుక్త కార్యాచరణ ద్వారా రాష్ట్రీయ గోకుల్‌ మిషన్‌లో భాగంగా ఎల్‌ఐవిఎప్‌ పిండగర్భ ధారణ పథకం చేపట్టి దేశీయ జాతుల పిండాలు ఉత్పత్తి చేసి వాటి పరిరక్షణకు దోహదపడుతుందన్నారు.

  • పరిశోధన సాగిందిలా..

మేలుజాతి ఒంగోలు ఆవునుండి పశుగణాభివృద్ధి సంస్థ పశువైద్యులు డాక్టర్‌ శ్రీమన్నారాయణ అండాలను సేకరించారు. లాంపార్మ్‌ శాస్త్రవేత్త శ్రీకాంత్‌ వాటిని ఇన్విట్రో పెర్టిలైజేషన్‌ ద్వారా మేలుజాతి ఆంబోతు వీర్యంతో ఫలదీకరణ చేసి ఏడు రోజులు ప్రయోగశాలలో శాస్త్రీయ విధానంలో పిండాలుగా మార్చి ద్రవనత్రజనిలో భద్రపరిచారు. సరోగేట్‌ (అద్దె గర్భం) ఆవును కోలలపూడి డాక్టర్‌ మాధవీలత ఎంపిక చేశారు. ఆవు గర్భంలో పిండాన్ని డాక్టర్‌ సోమశేఖర్‌ ప్రవేశపెట్టారు. మాములు పద్ధతి ద్వారా అయితే ఆవు జీవితకాలంలో కేవలం ఎనిమిది నుంచి పది దూడలు మాత్రమే జన్మనిస్తాయి. జన్యుపర పద్ధతి ద్వారా అయితే ఒక్క ఆవులో 150 పిండాల వరకు జన్యుమార్పిడి చేసి సుమారు 50 నుండి 60 దూడలు పొందవచ్చు.