Feb 28,2023 21:55
  • ఆస్ట్రేలియాతో మూడో టెస్ట్‌ నేటినుంచే..
  • ఉదయం 9.30గం||ల నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో

ఇండోర్‌: బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీలో భాగంగా ఇండోర్‌ వేదికగా బుధవారం నుంచి మూడో టెస్ట్‌ ప్రారంభం కానుంది. నాలుగు టెస్ట్‌ మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఇప్పటివరకు జరిగిన తొలి రెండు టెస్టుల్లో గెలిచిన భారతజట్టు మరో టెస్ట్‌ మ్యాచ్‌లో గెలిస్తే నేరుగా ప్రపంచ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌(డబ్ల్యుటిసి) ఫైనల్‌కు దూసుకెళ్లాలన్న ఉత్సాహంతో ఉంది. లండన్‌ వేదికగా జూన్‌లో డబ్యుటిసి ఫైనల్‌ జరగనుంది. లండన్‌ పించ్‌ పేసర్లకు అనుకూలం కావడంతో దానికి తగ్గట్టుగా ప్రాక్టీస్‌ దక్కాలంటే మాత్రం ఆసీస్‌తో మిగిలిన ఈ రెండు టెస్టులే కీలకం. ఈ క్రమంలో టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ కూడా ఇదే విషయాన్ని వెల్లడించాడు. ఫైనల్‌లోనూ ఆసీస్‌తోనే ఆడే అవకాశాలు ఉన్నట్లు పేర్కొన్నాడు. ''ఇండోర్‌లో తాము అనుకున్న ఫలితం వస్తే తప్పకుండా అహ్మదాబాద్‌లో పిచ్‌ విషయంలో భిన్నంగా ఆలోచన చేస్తాం. ఎందుకంటే డబ్ల్యుటిసి ఫైనల్‌ అనేది పూర్తిగా ప్రత్యేకంగా ఉంటుంది. అదీనూ లండన్‌ వేదికగా ఆసీస్‌తోనే తలపడాల్సి రావచ్చు. పేస్‌ పిచ్‌కు తగ్గట్లుగా ప్రాక్టీస్‌ చేసేందుకు నాలుగో టెస్టు వేదిక అయిన అహ్మదాబాద్‌ను తయారు చేయాలని ఇప్పటికే మేం చర్చించుకున్నాం. మా ఆటగాళ్లు కూడా దానికి సిద్ధంగా ఉన్నారు'' అని పేర్కొన్నాడు. ఇక ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌ అనంతరం వన్డే సిరీస్‌ను భారత్‌ ఆడనుంది. అనంతరం మార్చి 31 నుంచి మే చివరి వరకు ఐపిఎల్‌-2023 జరగనుంది.