Oct 07,2023 21:23

ప్రజాశక్తి - కర్నూలు కలెక్టరేట్‌ : ప్రతి ఒక్కరి వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దడంలో సాహిత్యం పాత్ర చాలా గొప్పదని రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ కార్యదర్శి ఎస్‌ఎండి.ఇంతియాజ్‌ అభిప్రాయపడ్డారు. 'సలీం సాహిత్యం- సామాజిక చైతన్యం' అనే అంశంపై కర్నూలులోని ఉస్మానియా కళాశాలలో శనివారం జాతీయ సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంతియాజ్‌ మాట్లాడుతూ.. డబ్బు సంపాదనే విజయానికి పరమావధి కాదని, ఇతరులకు సేవ చేయడంలోనే నిజమైన ఆనందం ఉంటుందని సలీం సాహిత్యం రుజువు చేసిందని తెలిపారు. ఐఆర్‌ఎస్‌ అధికారిగా అడిషనల్‌ కమిషనర్‌ ఆఫ్‌ ఇన్‌కమ్‌టాక్స్‌ స్థాయికి చేరుకున్న సయ్యద్‌ సలీం లాంటి వ్యక్తి ఇంతటి విస్తృతమైన సాహితీ రచనలు చేయడం అభినందనీయమన్నారు. కళాశాల కార్యదర్శి, కరస్పాండెంట్‌ అజ్రాజావేద్‌ మాట్లాడుతూ.. సలీం స్ఫూర్తితో విద్యార్థి దశ నుండే అందరూ రచనలు చేయడం ప్రారంభించాలని కోరారు. ఉస్మానియా కళాశాల ప్రిన్సిపల్‌ సయ్యద్‌ సమీవుద్దీన్‌ ముజామిల్‌ మాట్లాడుతూ.. వైవిధ్య భరితమైన అంశాలు తీసుకొని ప్రతి పాఠకుడిని చదివింపచేసే విధంగా సలీం నవలలు రచించారని తెలిపారు. రచయిత సయ్యద్‌ సలీం మాట్లాడుతూ.. తాను బాల్యంలో అత్యంత పేదరికాన్ని అనుభవించానన్నారు. శారీరక వైకల్యంతో మరొక సవాలు ఎదుర్కొన్నానని, వీటన్నింటినీ అధిగమించే శక్తి నాకు విద్య అందించిందని తెలిపారు. పరిశోధనా పత్రాలను సాహితీ స్రవంతి రాష్ట్ర కార్యదర్శి జంధ్యాల రఘుబాబు సదస్సులో సమర్పించారు. కళాశాల తెలుగు విభాగ అధ్యక్షులు అన్వర్‌ హుస్సేన్‌ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో ఉస్మానియా విశ్వవిద్యాలయం విశ్రాంత తెలుగు ఆచార్యులు వెలుదండ నిత్యానందరావు, అధ్యాపకులు జె సునీత, కె అరుణాదేవి, విమర్శకులు కెపి అశోక్‌ కుమార్‌ పాల్గొన్నారు.