Oct 07,2023 16:25
  • చంద్రబాబు అరెస్ట్‌కు నిరసనగా గుంటూరులో భారీ ర్యాలీ
  • పోలీసు ఆంక్షలను ఛేదించుకుని దూసుకువెళ్లిన కార్యకర్తలు
  • ముందస్తు అరెస్టులు, గృహనిర్బంధాలు

ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా శనివారం గుంటూరులో టిడిపి నాయకులు ధర్మాగ్ర శాంతిర్యాలీ నిర్వహించారు. ర్యాలీకి అనుమతి లేదంటూ పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను ఛేదించుకుని టిడిపి నాయకులు, కార్యకర్తలు, మహిళలు ముందుకు దూసుకువెళ్లారు. ఈ నేపథ్యంలో కార్యకర్తలు, నాయకులపౖౖె పోలీసులు లాఠీఛార్జి చేశారు. తొలుత స్థానిక అంబేద్కర్‌ సెంటర్‌ నుంచి ర్యాలీ ప్రారంభించారు. అయితే ర్యాలీకి వచ్చినవారిని వచ్చినట్లు పోలీసులు అరెస్టు చేశారు. దీంతో తోపులాట జరిగింది. టిడిపి నాయకులను, కార్యకర్తలను నియంత్రించేందుకు దాదాపు 800 మంది పోలీసులు ప్రయత్నించారు. పోలీసులను తోసుకుంటూ టిడిపి నాయకులు, కార్యకర్తలు ముందుకెళ్లారు. దీంతో పలువురు నాయకులను పోలీసులు అరెస్టు చేసి నగరంలోని పలు స్టేషన్లకు తరలించారు. అరెస్టులు, నిర్బంధాలు లెక్కచేయక అంబేద్కర్‌ సెంటర్‌ నుంచి హిమనీసెంటర్‌ వరకు కొందరు టిడిపి నాయకులు భారీ ర్యాలీ నిర్వహించి గాంధీవిగ్రహానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి నక్కా ఆనంద్‌బాబు మాట్లాడుతూ.. నగరంలో నెలల తరబడి సెక్షన్‌ 30, 144 అమలు చేస్తూ ప్రజా నిరసనను అడ్డుకోవడానికి పోలీసు అధికారులు ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు తమకు ఉందని తెలిపారు. సిపిఐ, జనసేన పార్టీలు మద్దతు తెలిపాయి. ర్యాలీలో మాజీ మంత్రులు ఆలపాటి రాజేంద్రప్రసాద్‌, నక్కా ఆనంద్‌బాబు, నన్నపనేని రాజకుమారి, పార్టీ జిల్లా అధ్యక్షులు తెనాలి శ్రావణ్‌కుమార్‌ (గుంటూరు), జి.వి.ఆంజనేయులు (పల్నాడు), నగర టిడిపి అధ్యక్షులు డేగల ప్రభాకర్‌, జనసేనపార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాసయాదవ్‌, నగర అధ్యక్షులు నేరెళ్ల సురేష్‌ తదితరులు పాల్గొన్నారు.
ఉదయం నుంచి మాజీ మంత్రులు కన్నా లక్ష్మీనారాయణ, పత్తిపాటి పుల్లారావును పోలీసులు గృహనిర్బంధంలో ఉంచారు. పలువురు ద్వితీయ శ్రేణి నాయకులకు ముందస్తు నోటీసులు ఇచ్చారు. పలువురు జనసేన, సిపిఐ నాయకులకు కూడా నోటీసులు ఇచ్చి గృహ నిర్బంధించారు.