పరవాడ (అనకాపల్లి) : టిడిపి సీనియర్ నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణ ఇంటి వద్ద ఆదివారం అర్థరాత్రి తీవ్ర ఉద్రికత ఏర్పడింది. నిన్న అర్థరాత్రి అనకాపల్లి జిల్లా పరవాడ మండలం వెన్నెలపాలెంలో డీఎస్పీ కేవీ సత్యనారాయణ, సీఐ ఈశ్వరరావు భారీ పోలీసు బలగాలతో బండారు నివాసానికి చేరుకున్నారు. బండారు నివాసానికి వెళ్లే ముఖ్యమైన మార్గాలన్నిటినీ ... సినిమా హాలు కూడలి, విద్యుత్తు ఉప కేంద్రం కూడలి, వెన్నెలపాలెం ప్రాంతాల్లో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ విషయం తెలిసిన టిడిపి శ్రేణులు సత్యనారాయణ ఇంటి వద్దకు చేరుకునేందుకు ప్రయత్నించారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. అర్ధరాత్రి తమ నాయకుడి ఇంటికి ఇంతమంది పోలీసులు రావాల్సిన అవసరమేంటని టిడిపి శ్రేణులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మంత్రి రోజాపై అసభ్య పదజాలంతో వ్యాఖ్యలు చేశారంటూ బండారు సత్యనారాయణపై గుంటూరు జిల్లా నగరపాలెం పీఎస్‌లో పలు సెక్షన్ల కింద కేసు నమోదైనట్లు డీఎస్పీ చెప్పారని టిడిపి నేతలకు తెలిపారు.
బండారు సత్యనారాయణ ఇటీవల రాష్ట్ర మంత్రి రోజాపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ డీజీపీకి లేఖ రాసిన విషయం తెలిసిందే. ఈ అంశంపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని లేఖలో కోరారు. ఆ క్రమంలోనే పరవాడ డీఎస్పీ కె.వి.సత్యనారాయణ, సీఐ ఈశ్వరరావు అర్ధరాత్రి సమయంలో భారీ పోలీసు బలగాలతో బండారు నివాసానికి చేరుకున్నారు. ప్రహరీ గేట్లు తీసుకుని లోపలికి ప్రవేశించారు. బండారుకు 41ఏ నోటీసు జారీ చేసి స్టేషన్‌కు తీసుకెళ్లాలని పోలీసులు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఈ విషయం తెలుసుకున్న మాజీ జెడ్పీటీసీ సభ్యుడు పైల జగన్నాథరావు, మండల టిడిపి నాయకులు, కార్యకర్తలు బండారు ఇంటికి తరలివచ్చారు. టిడిపి శ్రేణులు వస్తుండటంతో పోలీసులు ఎక్కడికక్కడ వారిని అడ్డుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ...ఉద్రిక్త పరిస్థితి కొనసాగుతోంది.










