తాడేపల్లి (గుంటూరు) : తాడేపల్లిలోని సిఎం జగన్ ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. బుద్దా వెంకన్న, పిల్లి మాణిక్యరావును పోలీసులు అరెస్టు చేశారు.
రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి పై ఆయన కుటుంబీకులు, టిడిపి శ్రేణులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో .... శుక్రవారం ఉదయం టిడిపి నేతలు పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో సమావేశమై సిఎం జగన్ ఇంటికి వెళ్లి వినతిపత్రాన్ని అందజేయాలని నిర్ణయించారు. చంద్రబాబు వద్దకు ఆయన వ్యక్తిగత వైద్యుల బృందాన్ని పంపాలని టిడిపి నేతలు డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ఎయిమ్స్ ఆస్పత్రికి చంద్రబాబును తరలించాలన్నారు. ఆరోగ్య క్రమశిక్షణ పాటించడం వల్లే 73 ఏళ్లున్నా.. 20 ఏళ్ల యువకుడిలా చంద్రబాబు పని చేస్తున్నారని టిడిపి నేతలు తెలిపారు. అయితే జైలులో చంద్రబాబు ఒకేసారి ఐదు కేజీల బరువు తగ్గారనీ... బరువు తగ్గితే శరీరంలోని అన్ని అవయవాలపై ప్రభావం పడుతుందని డాక్టర్లు చెబుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు... ముఖ్యమంత్రి నివాసానికి వెళ్లాలని నిర్ణయించామని, చంద్రబాబును రక్షించుకోవడం కోసం సిఎం జగన్ ఇంటికెళ్లి వినతిపత్రం ఇస్తామని టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు బోండా ఉమామహేశ్వరరావు, బుద్దా వెంకన్న, వర్ల రామయ్య, నక్కా ఆనంద్ బాబు, కళా వెంకట్రావ్, మాజీ మంత్రి దేవినేని ఉమా, ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ తెలిపారు. అనంతరం తాడేపల్లిలోని ముఖ్యమంత్రి జగన్ నివాసం వద్దకు బయలుదేరారు. సిఎం జగన్ ఇంటికి సమీపాన టిడిపి బృందాన్ని పోలీసులు అడ్డగించారు. దీంతో అక్కడ ఉద్రిక్తత ఏర్పడింది. పోలీసులకు, నేతలకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. బుద్దా వెంకన్న, పిల్లి మాణిక్యరావును పోలీసులు అరెస్టు చేశారు.










