ప్రజాశక్తి-హెల్త్ యూనివర్సిటీ :ఆసియా క్రీడల్లో టెన్నిస్ పురుషుల డబుల్స్‌లో రజత పతకం సాధించిన సాకేత్ మైనేనికి ఉద్యోగం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు పర్యాటక, సాంస్కఅతిక శాఖ మంత్రి ఆర్కే రోజా ప్రకటించారు. సాకేత్‌కు రాష్ట్రంలో టెన్నిస్ అకాడమీ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం స్థలం కేటాయించే ఆలోచనలో ఉందని తెలిపారు. చైనాలోని హాంగ్‌జౌలో జరిగిన ఆసియా క్రీడల్లో సాకేత్ రజత పతకం సాధించిన నేపథ్యంలో విజయవాడ మొగల్రాజపురంలోని పిబి సిద్ధార్థ అకాడమీలో ఆంధ్రప్రదేశ్ లాన్ టెన్నిస్ అసోసియేషన్ ఆదివారం ఆయనను సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి రోజా మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా దేశానికి ప్రాతినిధ్యం వహించడానికి క్రీడలు మాత్రమే మార్గమని అన్నారు. ఈ కార్యక్రమంలో విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కమ్మ కార్పొరేషన్ చైర్‌పర్సన్ తుమ్మల చంద్రశేఖర్, మాజీ ఎంపి గోకరాజు గంగరాజు, ఆంధ్రప్రదేశ్ లాన్ టెన్నిస్ సంఘం ఉపాధ్యక్షుడు డాక్టర్ పట్టాభి రామయ్య, కార్యదర్శి పివి రామకుమార్ తదితరులు పాల్గన్నారు. అంతకుముందు ఇందిరాగాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియం ఆవరణలోని టెన్నిస్ కాంప్లెక్స్‌లో జరిగిన కార్యక్రమంలో ఎన్‌టిఆర్ జిల్లా లాన్ టెన్నిస్ అసోసియేషన్, ఎన్‌టిఆర్ జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో సాకేత్‌ను ఘనంగా సన్మానించారు.










