-బైజూస్ కంటెంట్ అర్థం కాక విద్యార్థుల్లో గందరగోళం
-సక్రమంగా పని చేయని ట్యాబ్‌లు
-ఉపాధ్యాయులకూ తప్పని ఇబ్బందులు
ప్రజాశక్తి- కాకినాడ ప్రతినిధి :కాకినాడ జిల్లా పెదపూడి మండలం ఎల్‌ఎన్ పురం జిల్లా పరిషత్ హైస్కూలులో 28 మంది విద్యార్థులకు, ఏడుగురు ఉపాధ్యాయులకు ప్రభుత్వం ట్యాబులు అందించింది. విద్యార్థులకిచ్చిన వాటిలో పది వరకూ సాంకేతిక ఇబ్బందుల వల్ల పని చేయడం లేదు. సాఫ్ట్‌వేర్ సమస్యలు, ఆన్ కాకపోవడం, యాప్స్ డౌన్‌లోడ్, నెట్ కనెక్టింగ్ అవ్వకపోవడం ఇలా ప్రతి రోజూ అవస్థలు ఎదురవుతున్నాయని ఉపాధ్యాయులు తెలిపారు.
కాకినాడ రూరల్ పండూరు జడ్‌పి హైస్కూల్‌కు 60 ట్యాబులు ఇవ్వగా, వాటిలో 20 వరకూ పని చేయడం లేదు. పని చేస్తున్న వాటిలో టీచర్లు చెబుతున్న దానికి, బైజూస్ కంటెంట్‌కు తేడాలు ఉన్నాయి. భిన్నమైన కాన్సెప్ట్‌లు ఉండడం వల్ల అర్థం కావడం లేదని అక్కడ విద్యార్థులు తెలిపారు. రెండింటిలో దేన్ని చదవాలనే దానిపై క్లారిటీ లేదని చెప్పారు.
2022 డిసెంబర్ 21న ముఖ్యమంత్రి ట్యాబ్‌ల పంపిణీని ప్రారంభించారు. కాకినాడ జిల్లాలో 20,094 మంది 8వ తరగతి విద్యార్థులకు, 3,005 మంది టీచర్లకు ట్యాబ్‌లు అందించారు. ట్యాబ్‌లలో పొందుపరిచిన యాప్‌ల ద్వారా విద్యార్థులు పాఠశాలలోనూ, ఇళ్ల వద్ద పాఠాలు విని అందులోనే సమాధానాలను కూడా పొందుపరచాల్సి ఉంటుంది. ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ విద్యను ప్రవేశపెట్టడంలో భాగంగా లెర్నింగ్ యాప్ బైజూస్ కంటెంట్‌తో పాఠాలను 8వ తరగతి విద్యార్థులకు ఇచ్చిన ట్యాబ్‌ల్లో నిక్షిప్తం చేశారు. ఇందులో తెలుగు, ఇంగ్లీష్, హిందీతో పాటు ఎనిమిది భాషల్లో మ్యాథ్స్, సివిక్స్, హిస్టరీ, ఫిజిక్స్, బయాలజీ, జియాలజీ, జువాలజీ, పాఠాలు పొందుపర్చారు. 2 నుంచి 4 నిమిషాలపాటు యానిమేషన్, వీడియోల రూపంలో పాఠాలు ఉన్నాయి. ఏటా 8వ తరగతి పిల్లలకు ట్యాబులు అందిస్తామని, మూడేళ్లపాటు వాటిలో ఉన్న కంటెంట్ ఆధారంగా బోధన ఉంటుందని ప్రభుత్వం చెబుతోంది.
- మూణ్నాల్ల ముచ్చటేనా?
పలు స్కూళ్లలో ట్యాబ్‌లు తరచూ సాంకేతిక సమస్యలతో మోరాయిస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో నెట్‌వర్క్ సమస్యలు ఎదురవుతున్నాయి. లాగిన్ కాకపోవడం, క్యూఆర్ కోడ్‌లు స్కాన్ అవ్వకపోవడం, తరచూ మరమ్మతులకు గురవడం తదితర కారణాలతో డిజిటల్ విద్య మూణ్నాల్ల ముచ్చటగా మారనుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. విద్యార్థులకు వాటి వినియోగం మీద అవగాహన లేకపోవడంతో ఆశించిన మేరకు ప్రయోజనం ఉండడం లేదని టీచర్లు చెబుతున్నారు. ఇచ్చిన రెండు నెలలకే ట్యాబ్‌లు పని చేయడం లేదని తెలిపారు. కిర్లంపూడి మండలం తామరాడలో 131 ట్యాబ్‌లు విద్యార్థులకు అందించగా, సాంకేతిక సమస్యల వల్ల వాటిలో 12 పనిచేయడం లేదు. ఇదే మండలం గెద్దనాపల్లిలో 65 అందించగా, 15 ట్యాబ్‌లు వివిధ కారణాలతో మూలకు చేరాయి. ప్రత్తిపాడు మండల కేంద్రంలోని హైస్కూలుకు 160 అందించగా, టెక్నికల్ సమస్యల వల్ల 12 ట్యాబ్‌లు పని చేయడంలేదని, ఏడు ట్యాబ్‌లు స్క్రీన్ డ్యామేజ్ అయ్యాయని, 14 ట్యాబ్‌లకు సంబంధించి క్యూఆర్ కోడ్‌లు స్కాన్ అవ్వడం లేదని ఉపాధ్యాయులు తెలిపారు. ఏలేశ్వరం మండల కేంద్రంలోని హైస్కూల్లో 88 పంపిణీ చేయగా, 20 వరకు పనిచేయడం లేదు. పుస్తకాల్లో చదివిన దానికి, యాప్‌లలో కంటెంట్‌కు స్పష్టత కరువైందని పలువురు విద్యార్థులు తెలిపారు.
- ఆశించిన ఫలితాలు తక్కువే- టి.చక్రవర్తి, యుటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి,కాకినాడ జిల్లా
ఈ ట్యాబ్‌లో కంటెంట్‌కు అనుగుణంగా బోధన జరగడం లేదు. ఒక్కోక్కటి మూడేళ్లపాటు వీటిని వినియోగించాలని ప్రభుత్వం చెబుతుండగా మొదటి రెండు నెలలకే మూలన పడుతున్నాయి. పుస్తకాల్లో ఉన్న సిలబస్ పూర్తి చేయడమే పెద్ద పనిగా ఉంది. అదనంగా ట్యాబ్‌లో ఉన్న విషయాలు చెప్పాలంటే సమయం సరిపోవడం లేదు. టీచర్ల పోస్టులు కొరత కారణంగా రెండు, మూడు తరగతులను కలిపి బోధించాల్సి వస్తోంది. దీంతో, ట్యాబ్‌ల వల్ల ఆశించిన ఫలితాలు వచ్చే అవకాశం కనిపించం లేదు.










