Jun 28,2023 21:55
  • రానున్న ఐదు నెలల్లో మూడు విదేశీ పర్యటనలు
  • స్వదేశంలో ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్తాన్‌తో సిరీస్‌లు
  • అక్టోబర్‌లో ఐసిసి వన్డే ప్రపంచకప్‌

ముంబయి: రానున్న ఐదు నెలల్లో టీమిండియా బిజీ బిజీగా గడపనుంది. ఇందులో రెండు విదేశీ పర్యటనలతోపాటు శ్రీలంక వేదికగా ఆసియాకప్‌తోపాటు వన్డే ప్రపంచకప్‌కు ముందు స్వదేశంలో ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్తాన్‌తో సిరీస్‌లతో టీమిండియా తీరికలేని షెడ్యూల్‌తో సతమతమౌతోంది. డబ్ల్యుటిసి ఫైనల్‌ తర్వాత నెల రోజుల విరామం తర్వాత జులైలో వెస్టిండీస్‌ పర్యటనకు వెళ్లనున్న టీమిండియా.. ఆ సిరీస్‌లో రెండు టెస్ట్‌లు, మూడు వన్డేలు, ఐదు టి20ల సిరీస్‌ ఆడనుంది. ఈ పర్యటన జూలై 12నుంచి ఆగస్టు 13వరకు సాగనుంది. ఆ వెంటనే మూడు టి20ల సిరీస్‌ ఆడేందుకు టీమిండియా ఐర్లాండ్‌ పర్యటనకు వెళ్లనుంది. ఈ పర్యటన ఆగస్టు 18 నుంచి 23వరకు సాగనుంది. సెప్టెంబర్‌లో శ్రీలంక వేదికగా ఆసియాకప్‌ జరగనుంది. అనంతరం సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో పాటు ఆఫ్ఘనిస్తాన్‌తో టీమిండియా మూడేసి వన్డేల సిరీస్‌ ఆడనుంది. వన్డే ప్రపంచకప్‌ సన్నాహకంలో భాగంగా ఈ సిరీస్‌లు నిర్వహించనున్నారు. ఈ సిరీస్‌లకు సంబంధించిన షెడ్యూల్‌ ఖారారు కానప్పటికీ సెప్టెంబర్‌లోనే జరగనున్నాయి. అక్టోబర్‌ నుంచి నవంబర్‌ మధ్య వన్డే ప్రపంచకప్‌ జరగనుంది. వన్డే ప్రపంచకప్‌ నేపథ్యంలో వెస్టిండీస్‌తో పాటు ఐర్లాండ్‌ పర్యటనకు యువ ఆటగాళ్లతో కూడిన జట్టును బిసిసిఐ పంపించనుంది. వన్డే ప్రపంచకప్‌ ఆడనున్న ఆటగాళ్లను కేవలం 50ఓవర్ల ఫార్మాట్‌కే పరిమితం చేయనున్నారు. ఐర్లాండ్‌ పర్యటనకు సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ను బిసిసిఐ ప్రకటించింది. ఆగస్టు 18, 20 23న మూడు టి20 ఆడనుంది. ఈ పర్యటనకు హార్దిక్‌ పాండ్యాతో పాటు ప్రపంచకప్‌ ప్రణాళికల్లో ఉన్న ఆటగాళ్లందరూ దూరంగా ఉండనున్నారు. ఐపిఎల్‌లో సత్తా చాటిన తిలక్‌ వర్మతో పాటు రింకూ సింగ్‌ వంటి ఆటగాళ్లు ఈ సిరీస్‌ ఆడే అవకాశం ఉంది. ఈ సిరీస్‌కు జస్ప్రీత్‌ బుమ్రా రీఎంట్రీ ఇవ్వనున్నట్లు సమాచారం.