Jul 12,2023 09:06
  • ఫలితాలు/ ఆధిక్యతలు వెలువడిన 57,665 గ్రామ పంచాయతీ స్థానాల్లో తృణమూల్‌ 36,665
  • బిజెపి7,263, సిపిఎం-2,397, కాంగ్రెస్‌- 1811
  • మెరుగుపడిన లెఫ్ట్‌

కొల్‌కతా : బెంగాల్‌ పంచాయతీ ఎన్నికల్లో అడ్డుఅదుపులేని హింస, భారీగా ఎన్నికల అక్రమాలకు పాల్పడిన అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌ చివరికి ఫలితాల్లో తనదే పైచేయి అని చాటుకుంది. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య 23 జిల్లాల్లోని 339 కౌంటింగ్‌ కేంద్రాల్లో మంగళవారం ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. మొదట గ్రామ పంచాయితీ, తరువాత పంచాయతీ సమితి, చివరిగా జిల్లా పరిషత్‌ ఓట్ల లెక్కింపు చేపట్టారు. కడపటి వార్తలందే సరికి 63, 229 గ్రామ పంచాయతీలకు గాను 57,136 స్థానాల్లో ఫలితాలు, ఆధిక్యతలు వెలువడగా తృణమూల్‌ -36, 665, బిజెపి 7,263, లెఫ్ట్‌ 2,397, కాంగ్రెస్‌-1811 స్థానాల్లో ముందంజలో ఉన్నాయి. 9,730 పంచాయతి సమితి స్థానాలకు గాను 2,505 స్థానాల ఫలితాలు, ఆధిక్యతలు వెల్లడించగా తృణమూల్‌ 2,319, బిజెపి-109, లెఫ్ట్‌ 39, కాంగ్రెస్‌ 36 స్థానాల్లో ఆధిక్యతలో ఉన్నాయి. మొత్తమ్మీద లెఫ్ట్‌ మరీ ముఖ్యంగా సిపిఐ(ఎం) గతంతో పోలిస్తే ఈసారి మెరుగైన ఫలితాలు సాధించింది. రాష్ట్రంలో గ్రామపంచాయతీ మొత్తం సీట్లు 63,229. ఇందులో 6,238 సీట్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యాయి. పంచాయతీ సమితిలో మొత్తం సీట్లు 9,730. ఇందులో 759 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. జిల్లా పరిషత్‌లో మొత్తంగా 928 స్థానాలు ఉండగా, ఏకగ్రీవంగా 8 స్థానాలు ఎన్నికయ్యాయి. మొత్తంగా పశ్చిమ బెంగాల్‌లో 73,887 గ్రామ స్థానిక సంస్థల స్థానాలు ఉండగా, ఇందులో 7005 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. దీంతో ఈ ఏడాది పోటీలేకుండా ఎన్నికైన సీట్ల శాతం 9.48 శాతంగా ఉంది. మిగిలిన స్థానాలకు ఈ నెల 8న ఎన్నికలు జరిగాయి.
 

                                                                కౌంటింగ్‌ రోజునా రెచ్చిపోయిన టిఎంసి గూండాలు

బెంగాల్‌లో పంచాయతీ ఎన్నికల ప్రారంభం నుంచి విధ్వంసానికి పాల్పడుతున్న టిఎంసి గూండాలు చివరి అంకం కౌంటింగ్‌ రోజున కూడా రెచ్చిపోయారు. అనేక కౌంటింగ్‌ కేంద్రాల వద్ద ప్రతిపక్ష పార్టీల ఏజెంట్లపై దాడులకు దిగారు. అధికారులను భయభ్రాం తులకు గురి చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.
 

                                                              ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షుడి నిర్భంధం

పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు నేపథ్యంలో డైమండ్‌ హర్బర్‌ వద్ద ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షులు ప్రాతికూర్‌ రహ్మన్‌ను మంగళవారం పోలీసులు నిర్భంధంలోకి తీసుకున్నారు. రహ్మన్‌ అక్రమ నిర్భంధాన్ని వ్యతిరేకిస్తూ ఎస్‌ఎఫ్‌ఐ కార్యకర్తలు ఆందోళనలకు దిగారు. సెంట్రల్‌ కొల్‌కతాలోని కాలేజ్‌ స్ట్రీట్‌ను దిగ్భంధించారు.

                                                               బెంగాల్‌ ప్రజలకు సిపిఎం అభినందనలు

  • తృణమూల్‌ హింసను తిప్పికొట్టారని పొలిట్‌బ్యూరో ప్రశంస

న్యూఢిల్లీ : పశ్చిమ బెంగాల్‌ పంచాయితీ ఎన్నికల సందర్భంగా తృణమూల్‌ కాంగ్రెస్‌ కనివినీ ఎరుగని రీతిలో సాగించిన హింసను తిప్పికొట్టడంలో అసమానమైన ధైర్య సాహసాలను ప్రదర్శించిన పశ్చిమ బెంగాల్‌ ప్రజలు , వామపక్ష సంఘటన, ఇతర ప్రజాతంత్ర శక్తులను సిపిఐ(ఎం) అభినందించింది. పార్టీ పొలిట్‌బ్యూరో మంగళవారం నాడిక్కడ ఈ మేరకు ఒక ప్రకటన విడుదలజేసింది. జులై 8న రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన మూడంచెల పంచాయతీ రాజ్‌ ఎన్నికల్లో రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం, రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ప్రభుత్వానికి తొత్తులా వ్యవహరించాయని పొలిట్‌బ్యూరో విమర్శించింది.ఎన్నికల హింసకు 60మంది బలయ్యారు. వందలాదిమంది గాయపడ్డారు.
             స్వేచ్ఛగా, సక్రమంగా జరిగే ఎన్నికల్లో ప్రజలు తమకు ఇష్టమైన వారికి ఓటు వేసుకునే ప్రజాస్వామ్య హక్కును తిరస్కరించడమే లక్ష్యంగా హింస చెలరేగింది. నామినేషన్లు దాఖలు చేయకుండా అడ్డుకోవడంతో మొదలు బలవంతంగా వాటిని ఉపసంహరించుకునేలా ఒత్తిడి తీసుకురావడం, స్క్రూటినీ క్రమాన్ని తారుమారు చేయడం, ఓటింగ్‌ రోజున హింసకు పాల్పడడం ఇలా ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన అన్ని దశల్లోను భయంకరమైన రీతిలో దాడులకు పాల్పడింది. చివరకు ఓట్ల లెక్కింపు రోజున కూడా ఈ హింసాకాండ తప్పలేదు. ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో భద్రతా సిబ్బందే తగినంత మంది లేరు, ఇక కోల్‌కతా హైకోర్టు ఆదేశించిన విధంగా కేంద్ర భద్రతా బలగాల మోహరింపు గురించి మాట్లాడే పనే లేదు. ఓట్ల లెక్కింపు కేంద్రాల నుండి ప్రతిపక్షాలకు చెందిన కౌంటింగ్‌ ఏజెంట్లను బయటకు పంపివేయడం, బ్యాలట్‌ బాక్సులు పగలగొట్టడం, ప్రతిపక్షాలకు ముఖ్యంగా వామపక్షాలు, వారి మిత్రపక్షాలకు ఓటు వేసిన బ్యాలట్‌ పత్రాలను విసిరివేయడం, గెలుపొందిన అభ్యర్ధులకు జారీ చేసే సర్టిఫికెట్లు బలవంతంగా లాక్కోవడం, ఓట్ల లెక్కింపు కేంద్రంలో ఎంఎల్‌ఎలు, ఇతర అనధికార వ్యక్తులతో పెద్ద సంఖ్యలో తృణమూల్‌ కాంగ్రెస్‌ గూండాలు వుండడం వంటి ఘటనలు అనేకం చోటు చేసుకున్నాయి.
         పాలక పార్టీ, ప్రభుత్వం ప్రతిపక్షాలను లక్ష్యంగా చేసుకున్నాయి. ప్రధానంగా వామపక్షాలు, కాంగ్రెస్‌, ఇతర మిత్రులపై దృష్టి కేంద్రీకరించాయి. బిజెపితో మాత్రం అత్యంత జాగ్రత్తగా వ్యవహరిస్తూ వచ్చాయి.. అంటే ఇక పాలక పార్టీ గూండాయిజాన్ని ప్రధానంగా ఎదుర్కొన్నది వామపక్షాలు, కాంగ్రెస్‌, ఇతర బిజెపి వ్యతిరేక, తృణమూల్‌ వ్యతిరేక శక్తులే అన్నది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
        వామపక్షాలు, ఇతర లౌకిక మిత్రపక్షాలకు చెందిన అభ్యర్ధులను పెద్ద సంఖ్యలో గెలిపించినందుకు ప్రజలను పొలిట్‌ బ్యూరో ప్రత్యేకంగా అభినందించింది. పశ్చిమ బెంగాల్‌లో ప్రజాస్వా మ్యం, ఐక్యత, శాంతి కోసం జరిగే పోరాటంలో ప్రజా ప్రతిఘటన అనేది కొత్త అంశంగా వుందని పొలిట్‌బ్యూరో పేర్కొంది.