Sep 19,2023 11:31

అమరావతి : స్కిల్‌ డెవలప్‌మెంటు కేసుకు సంబంధించి టిడిపి అధినేత చంద్రబాబును అరెస్టు చేయడాన్ని వ్యతిరేకిస్తూ ... టిడిపి శ్రేణుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. మరోవైపు విదేశాల్లోనూ చంద్రబాబుకు మద్దతుగా నిరసనలు కొనసాగుతున్నాయి.

మంగళవారం గుంటూరులోని టిడిపి మాజీ మంత్రి నక్కా ఆనందబాబు ఇంటి వద్ద ఉద్రిక్తత ఏర్పడింది. నిరసన ర్యాలీ కోసం బయటకు వచ్చిన ఆనందబాబును పోలీసులు అడ్డుకున్నారు. తాను ఆంజనేయ స్వామి ఆలయంలో పూజకు వెళ్లాలని ఆనందబాబు తెలిపారు. వెళ్లడానికి అనుమతి లేదంటూ.. ఆనందబాబు వాహనాన్ని పోలీసులు అడ్డుకున్నారు. ఆనందబాబు కారుకు పోలీసులు వారి వ్యాన్లను అడ్డుపెట్టి నిర్బంధించారు. మరోవైపు ... చెన్నైలో ఐటి ఉద్యోగులు నిరసన కొనసాగిస్తున్నారు. చంద్రబాబును విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ ప్లకార్డులతో ఆందోళన చేపట్టారు. ఇదిలా ఉండగా ... అమెరికాలోని బే ఏరియాలో ఎన్‌ఆర్‌ఐలు నిరసన చేపట్టారు. ఆధారాలు లేకుండా చంద్రబాబును అరెస్టు చేశారంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తెలంగాణలోని సంగారెడ్డిలో టిడిపి శ్రేణులు బైక్‌ ర్యాలీ చేపట్టారు. నల్ల టీషర్టులను ధరించి ర్యాలీ చేపట్టారు. చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ ... ఒంటిమిట్టలో టిడిపి శ్రేణులు చేపట్టిన పాదయాత్రను పోలీసులు అడ్డుకున్నారు. కడప-రేణిగుంట రోడ్డుపై టిడిపి శ్రేణులను పోలీసులు అడ్డగించారు. పాదయాత్రకు అనుమతిలేదంటూ కడప డిఎస్‌పి షరీఫ్‌ అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు.