Sep 23,2023 12:15

అమరావతి : చంద్రబాబు కేసులో భాగంగా ... అడిషనల్‌ సెషన్స్‌ జడ్జి హిమబిందుపై సోషల్‌ మీడియాలో వస్తున్న ప్రచారంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఫిర్యాదు అందింది. ఈ నేపథ్యంలో ... ఎపి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌ రెడ్డికి రాష్ట్రపతి భవన్‌ కార్యదర్శి పీసీ మీనా.. లేఖ రాశారు. శనివారం ఉదయం రాజమండ్రి సెంట్రల్‌ జైలులో చంద్రబాబును ఎపి సిఐడి అధికారులు విచారిస్తున్న వేళ... ఈ కీలక పరిణామం చోటుచేసుకుంది.

రాష్ట్రపతికి ఫిర్యాదు ...
చంద్రబాబు కేసులో భాగంగా అడిషనల్‌ సెషన్స్‌ జడ్జి హిమబిందుపై సోషల్‌ మీడియాలో వస్తున్న ప్రచారంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ... పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన అడ్వకేట్‌ రామానుజరావు ఈ-మెయిల్‌ ద్వారా ఫిర్యాదు చేశారు. కాగా, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌ కేసులో చంద్రబాబును రిమాండ్‌కు పంపించిన తర్వాత హిమబిందు వ్యక్తిగత జీవితంపై టిడిపి నేతలు వివాదాస్పదంగా వ్యవహరించారనీ, హిమబిందు వ్యక్తిగత జీవితాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేస్తున్నారని రామానుజరావు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదుపై రాష్ట్రపతి భవన్‌ స్పందించింది. జడ్జి హిమబిందుకు సంబంధించిన ఫిర్యాదుపై వెంటనే చర్యలు తీసుకోవాలని జవహర్‌రెడ్డికి పీసీ మీనా లేఖ రాశారు.