ప్రజాశక్తి-బొబ్బిలి (విజయనగరం) : చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా ... చంద్రబాబు ఆరోగ్యంగా బెయిల్ పై బయటకు రావాలని కోరుతూ ... టిడిపి నియోజకవర్గ ఇంచార్జి బేబినాయన శుక్రవారం తలపెట్టిన పాదయాత్రను పోలీసులు అడ్డుకున్నారు. బొబ్బిలి నుంచి సింహాచలం వరకు పాదయాత్ర చేసి సింహాద్రిఅప్పన్నను దర్శించుకునేందుకు బేబినాయన పిలుపునిచ్చారు. ఈరోజు ఉదయం 8.30 గంటలకు శ్రీవేణుగోపాలస్వామి ఆలయం వద్ద ప్రత్యేక పూజలు చేసి పాదయాత్ర ప్రారంభించేందుకు టిడిపి నేతలు ఏర్పాట్లు చేశారు. పాదయాత్రకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో శుక్రవారం తెల్లవారుజామున కోటలోకి డిఎస్పీ శ్రీధర్, పట్టణ సిఐ ఎం.నాగేశ్వరరావు, పోలీసులు చేరుకుని బేబినాయన పాదయాత్రకు వెళ్లకుండా అదుపులోకి తీసుకుని బుదరాయవలస పోలీసు స్టేషన్ కు తరలించారు. టిడిపి ముఖ్య నేతలను, కార్యకర్తలను గఅహ నిర్బంధం చేశారు. శాంతియుతంగా పాదయాత్ర చేసి సింహాద్రిఅప్పన్న దర్శనం చేసుకునేందుకు వెళితే అక్రమంగా అరెస్టు చేయడం దుర్మార్గమని బేబీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం నిరంకుశంగా ప్రవర్తించడం దుర్మార్గమని బేబినాయన అన్నారు.










