Oct 17,2023 10:17
  • తెలంగాణలో బాలకృష్ణ ప్రచారం : కాసాని

ప్రజాశక్తి -హైదరాబాద్‌ బ్యూరో : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టిడిపి 87 స్థానాల్లో పోటీచేస్తుందని టిడిపి తెలంగాణ అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్‌ ప్రకటించారు. ఇప్పటికే 30 మందితో జాబితా సిద్ధంగా ఉందన్నారు. పార్టీ అధినేత చంద్రబాబు ఆమోదం లభించగానే మ్యానిఫెస్టోతో పాటు అభ్యర్థుల పేర్లను ప్రకటిస్తామని తెలిపారు. సోమవారం హైదరాబాద్‌లోని ఎన్‌టిఆర్‌ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ రాజమండ్రి సెంట్రల్‌ జైలులో చంద్రబాబును ములాఖాత్‌లో కలిశానని, రాష్ట్ర రాజకీయ పరిస్థితులను వివరించానని తెలిపారు. తెలంగాణలో టిడిపి బలంగా ఉందని, అసెంబ్లీ ఎన్నికల్లో తప్పకుండా పోటీచేస్తామని, జనసేనతో పొత్తు పెట్టుకోవాలా? లేదా? అనేది త్వరలో స్పష్టత వస్తుందని చెప్పారు. టిడిపి తరఫున రాష్ట్రంలో పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ప్రచారం చేస్తారని వివరించారు. చంద్రబాబు మంగళవారం బయటకు వస్తారని భావిస్తున్నట్టు చెప్పారు. ఆయన ఆరోగ్యంపై దేశవ్యాప్తంగా ఆందోళన నెలకొందన్నారు. ఎపి జగన్‌ అక్రమాలపై పోరాటం కొనసాగుతుందన్నారు. ఇతర పార్టీల నుంచి టిడిపిలో చేరేందుకు చాలా మంది సంప్రదిస్తున్నారని, కాంగ్రెస్‌ కంటే రాష్ట్రంలో టిడిపినే బలంగా ఉందని చెప్పారు. చంద్రబాబు నాయకత్వంలో బిసిలకు పెద్దపీట వేస్తామని ప్రకటించారు. అభ్యర్థులు పోటీచేయడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. గ్రేటర్‌లో కాకుండా తెలంగాణ జిల్లాల్లో బాలకృష్ణ ప్రచారం చేస్తారని చెప్పారు. టిడిపి మేనిఫెస్టో అందరికీ ఆదర్శంగా ఉంటుందన్నారు. విలేకర్ల సమావేశంలో పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు డా వాసిరెడ్డి రామనాథం, ప్రధాన కార్యదర్శులు జక్కలి ఐలయ్యయాదవ్‌, అజ్మీరా రాజునాయక్‌, తెలుగు మహిళ అధ్యక్షుఆలు భవనం షకీలారెడ్డి పాల్గొన్నారు.