Sep 25,2023 22:08
  • టిడిపి మాక్‌ అసెంబ్లీలో విమర్శలు

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రజల్ని పీడిస్తూ రాష్ట్రాన్ని లూఠీచేశారని టిడిపి విమర్శించింది. నాలుగేళ్లల్లో లక్షల కోట్లు సంపాదించారని ఆరోపించింది. అలాంటి వ్యక్తి అవినీతిపై సుభాషితాలు చెప్పడం హాస్యాస్పదమని పేర్కొంది. టిడిపి కార్యాలయంలో మాక్‌ అసెంబ్లీ జరిగింది. 'ఆర్థిక ఉగ్రవాది ఏ ధన పిశాచి' అనే అంశంపై వాయిదా తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సమావేశంలో వైసిపి బహిష్కృత ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆ పార్టీ శాసనసభాపక్ష ఉపనేత నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ 2000 సంవత్సరంలో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న జగన్‌, అతని కుటుంబం ఇప్పుడు అపర కుబేరులుగా ఎదిగారని వివరించారు. అవినీతిలోనూ, నేరచరిత్రలోనూ జగన్‌దే అగ్రస్థానమని, తనపై 38 కేసులున్నాయని జగన్‌ 2019 ఎన్నికల అఫిడవిట్‌లో చెప్పారని పేర్కొన్నారు. ఓబుళాపురం గనుల తవ్వకాల్లో గాలి జనార్థన్‌రెడ్డి పాత్రధారి అయితే తెరవెనుక సూత్రధారి జగన్‌ అని విమర్శించారు. సరస్వతి పవర్‌ ఇండిస్టీస్‌ పేరుతో దాచేపల్లి మండలంలో రైతుల్ని బెదిరించి భూములు లాక్కున్నారని పేర్కొన్నారు. తండ్రి అధికారంతో వేలకోట్లు కొట్టేశారని, తన అధికారంలో ప్రజల, ప్రభుత్వ ఆస్తుల్ని అప్పనంగా మింగేశారని విమర్శించారు. భూముల మాఫియాతో రూ.40వేల కోట్లు, మద్యం మాఫియాతో రూ.41వేల కోట్లు, మైనింగ్‌ మాఫియాతో రూ.35వేల కోట్లు, ఇసుక దోపిడీతో రూ.40వేల కోట్లు, ఎర్రచందనం మాఫియాతో రూ.25వేల కోట్లు, లేపాక్షి, కూకట్‌పల్లి భూకుంభకోణంతో రూ.25 వేల కోట్లు, విద్యుత్‌ కొనుగోళ్ల కమీషన్లతో రూ.12వేల కోట్లు, సిలికా, బీచ్‌శాండ్‌ దోపిడీతో రూ.10వేల కోట్లు.. ఈ విధంగా నాలుగేళ్లల్లో రూ.2,27,500కోట్లు జగన్‌కు వచ్చాయని విమర్శించారు. చంద్రబాబు అవినీతిపరుడని జగన్‌ చేస్తున్న ప్రచారం మొత్తం ఈర్ష్యాద్వేషాలతో చేస్తున్నదేనన్నారు. తన అవినీతి, దోపిడీని ప్రశ్నిస్తూ ప్రజల్లో చైతన్యం తీసుకొస్తున్న చంద్రబాబు కూడా జైల్లో ఉండాలన్న కుట్ర, దుర్మార్గంతోనే అన్యాయంగా కటకటాల పాలు చేశారని ఆరోపించారు. తమ అంశాలు పరిశీలించాక అయినా జగన్‌ చేసిన తప్పు తెలుసుకొని చంద్రబాబును తక్షణమే విడుదల చేసి, బహిరంగ క్షమాపణలు చెప్పాలని టిడిఎల్‌పి తరపున డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కె అచ్చెన్నాయుడు, శాసనమండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు, పత్తిపాటి పుల్లారావు, టిడి జనార్ధన్‌, గద్దె రామ్మోహనరావు, గొట్టిపాటి రవి, బాల వీరాంజనేయ స్వామి, చిరంజీవిరావు, అనురాధ తదితరులు పాల్గొన్నారు.