- నిందితుల్లో ఒకరు రౌడీషీటర్
ప్రజాశక్తి-శింగరాయకొండ(ప్రకాశం జిల్లా) : తన కుమార్తెను ఈవ్‌టీజింగ్ చేయవద్దన్నందుకు వ్యక్తిపై కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపర్చిన సంఘటన ప్రకాశం జిల్లా శింగరాయకొండలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... బైరాగి మాన్యంకు చెందిన ఓ మహిళను బొజ్జా మహేష్ (రౌడీ షీటర్), చదలవాడ సదానందం అనే ఇద్దరు వ్యక్తులు గత రెండు నెలలుగా ఈవ్‌టీజింగ్ చేస్తున్నారు. దీంతో ఆమె తండ్రి ఎస్‌కె.సుభాని వారిని గతంలో మందలించారు. సోమవారం రాత్రి తొమ్మిది గంటల సమయంలో మహేష్, సదానందం కలిసి సుభాని ఇంటి వద్దకు వచ్చారు. విజిల్ వేస్తూ సుభాని కుమారైను ఈవ్‌టీజింగ్ చేశారు. దీన్ని గమనించిన సుభాని వారి వద్దకు వెళ్లి తన కుమారైను ఎందుకు ఈవ్‌టీజింగ్ చేస్తున్నారని ప్రశ్నించారు. దీంతో మహేష్, సదానందం తమ వెంట తెచ్చుకున్న కత్తితో సుభానిపై దాడి చేశారు. అనంతరం వారు అక్కడి నుంచి పారిపోయారు. తీవ్రంగా గాయపడిన సుబానీని స్థానికులు 108 వాహనంలో కందుకూరు ఏరియా వైద్యశాలకు తరలించారు. సుభాని శరీరంపై ఆరు కత్తిపోట్లు ఉన్నట్లు వైద్యులు తెలిపారు. శింగరాయకొండ సిఐ రంగనాథ్, ఎస్‌ఐ శ్రీరామ్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.










