- నార్త్‌జోన్‌తో దులీప్ ట్రోఫీ
బెంగళూరు: చిన్నస్వామి స్టేడియంలో జరుగుతున్న దులీప్ ట్రోఫీ సెమీఫైనల్లో సౌత్ జోన్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 195పరుగులకు ఆలౌటైంది. ఓవర్ నైట్ స్కోర్ 4వికెట్ల నష్టానికి 63పరుగులతో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన సౌత్‌జోన్ జట్టును తిలక్ వర్మ(46) ఆదుకున్నాడు. మయాంక్ అగర్వాల్(76) కూడా అర్ధసెంచరీతో మెరిసాడు. లోయర్ ఆర్డర్ బ్యాటర్స్ నిరాశపరచడంతో సౌత్ జట్టు ఇన్నింగ్స్ 54.4 ఓవర్లలో 195పరుగులకే పరిమితమైంది. జయంత్ యాదవ్, వైభవ్ అరోరాకు మూడేసి, బల్జీత్ సింగ్, హర్షీత్ రాణాకు చెండేసి వికెట్లు దక్కాయి. తొలి ఇన్నింగ్స్‌లో నార్త్‌జోన్ జట్టు 198పరుగులకే చేయడంతో ఆ జట్టుకు 3పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యత లభించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన నార్త్ జోన్ జట్టు వర్షం కారణంగా రెండోరోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోయి 34పరుగులు చేసింది. ప్రశాంత్ చోప్రా(14), అంకిత్ కల్సి(15) క్రీజ్‌లో ఉన్నారు. ఆలూరు కస్కా క్రికెట్ మైదానంలో జరుగుతున్న మరో సెమీస్‌లో వెస్ట్‌జోన్ జట్టు సెంట్రల్ జోన్‌పై పట్టు బిగిస్తోంది. తొలి ఇన్నింగ్స్‌లో 220పరుగులు చేసిన వెస్ట్‌జోన్ జట్టు సెంట్రల్ జోన్‌ను తొలి ఇన్నింగ్స్‌లో 128పరుగులకే పరిమితం చేసింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన వెస్ట్‌జోన్ జట్టు రెండోరోజు ఆట ముగిసే సమయానికి 2వికెట్ల నష్టానికి 115పరుగులు చేసింది. దీంతో వెస్ట్‌జోన్ జట్టుకు ఇప్పటికే 207పరుగుల ఆధిక్యత లభించింది. సెంట్రల్ జోన్ ఆటగాడు ఆవేశ్ ఖాన్ భుజం నొప్పి కారణంగా బౌలింగ్ చేసేందుకు ఇబ్బంది పడ్డాడు.










