నాగ్‌పూర్ : తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురానికి చెందిన కోన శ్రీకర్ భరత్ రెండేళ్లుగా జాతీయ జట్టుకు ఎంపికవుతున్నా.. అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసే అవకాశం దక్కలేదు. ఫుల్‌టైమ్ వికెట్ కీపర్ కోటాలో రిషబ్ పంత్ తుది జట్టులో చోటు దక్కించుకోవడం.. శ్రీకర్ భరత్ బెంచ్‌కే పరి మితం కావడం పరిపాటి అయ్యింది. ఇటీవల కారు ప్రమాదంలో రిషబ్ పంత్ తీవ్రంగా గాయపడడంతో నాగ్‌పూర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్‌లో భరత్ తుది జట్టులో చోటు దక్కించున్నాడు. ఇదే క్రమంలో అరంగేట్రం టెస్టులోనే అద్భుత వికెట్ కీపింగ్‌తో అదరగొట్టాడు. మార్నస్ లబూషేన్‌ను మెరుపు వేగంతో స్టంపౌట్ చేసి మాజీ వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోనీని గుర్తు చేశాడు. శ్రీకర్ భరత్ తల్లిదండ్రులు ఉద్యోగరీత్యా విశాఖపట్నంలో స్థిరపడ్డారు. 2012లో ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లోకి అడుగు పెట్టిన భరత్ మొత్తం 78 మ్యాచ్‌లు ఆడి తొమ్మిది సెంచరీలు, 23 అర్ధ సెంచరీలతో 4,283 పరుగులు సాధించాడు. 2015లో గోవాతో జరిగిన రంజీ మ్యాచ్‌లో ట్రిపుల్ సెంచరీ (308) సాధించిన తొలి వికెట్ కీపర్‌గా ఘనత సాధించాడు. ఈ ప్రతిభతో భారత 'ఎ' జట్టులో రెగ్యులర్ సభ్యుడిగా మారిన భరత్ 2015లో ఐపిఎల్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌కు ప్రాతినిథ్యం వహించాడు.2021లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, 2022లో ఢిల్లీ తరఫున ఆడాడు.










