ఇంత పెద్ద సంచలన నిర్ణయం, కోట్ల ప్రజల జీవితాలను తారుమారు చేసిన నిర్ణయం గురించి...ఏడేళ్ళు గడిచినా దేశానికి ఒనగూడిన ప్రయోజనం ఏమిటో...ప్రధాన మంత్రి నేటికీ చెప్పనేలేదు! నాటి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కాలం చేశారు గనక ఆయన చెబుతారన్న ఆశ లేదు. అవినీతి అంతమొందిందా? నల్లధనం నశించిందా? ఉగ్రవాదం అదుపులోకి వచ్చిందా ? ఏవీ ఈ ప్రశ్నలకు సమాధానాలు? కనీసం ఎన్నికల ప్రచారంలో కూడా దాని ప్రస్తావన రావటం లేదు.
నోట్ల రద్దు నిర్ణయం వచ్చి నేటికి ఏడేళ్ళు. 2016 నవంబరు 8వ తారీకున రాత్రి 8 గంటలకు ప్రధానమంత్రి జాతినుద్దేశించి ప్రసంగిస్తారని ప్రకటన వచ్చినప్పుడు అందరూ విషయం ఏమిటా అని ఆసక్తిగా చూశారు. ఆ చారిత్రక ప్రసంగంలో చావుకబురు చల్లగా చెప్పారు: ఈ రోజు రాత్రి పన్నెడు గంటల తరవాత ఐదు వందలు, వెయ్యి రూపాయల నోట్లు చెల్లవు అని! ప్రజలకు అప్పుడు అర్ధమైందో లేదోకానీ తెల్లవారి పత్రికలు చూశాక విషయం అర్ధమైంది. అప్పటిదాకా చెలామణీలో వున్న ఐదు వందలు, వెయ్యి రూపాయల నోట్లు ఇహపై చెల్లు కావు అని అర్ధమైనాక బీద బిక్కి చేసిన ఆర్తనాదాలు నేడు కూడా చెవుల్లో మారుమోగుతున్నాయి.
ప్రధాన మంత్రి గారు ముచ్చటగా మూడు కారణాలు చెప్పారు ఆ నిర్ణయం తీసుకోవటానికి. ఒకటి అవినీతిని అరికట్టడం, రేడు నల్లధనాన్ని నియంత్రించటం, మూడు ఉగ్రవాదాన్ని రూపుమాపడం. నోట్ల రద్దు ప్రభావం తెలుసుకోవటానికి కేవలం యాభై రోజుల వ్యవధి ఇవ్వమని ప్రజలను అడిగారు ప్రధాన మంత్రి గారు. ఆ కాలంలో ఆయన చెప్పిన మార్పులు రాకపోతే ఏదో చెయ్యమన్నారు. అటువంటి యాభై రోజులు ఈ ఏడేళ్లలో యాభై గడిచాయి. అదేం చిత్రమోగానీ 2016 నవంబరు 8వ తేదీ తరువాత గురించిగానీ, నోట్ల రద్దు నిర్ణయం గురించిగానీ, దాని వలన దేశానికి ఒనగూడిన ప్రయోజనాల గురించిగానీ ఇన్నేళ్లలో ఒక్కటంటే ఒక్కసారి కూడా ప్రస్తావించలేదు...ప్రధాన మంత్రిగానీ మరెవరైనా గానీ. దేశాన్ని కుదిపేసింది ఈ ఆకస్మిక నిర్ణయం. అంగట్లో అన్నీ వున్నా, అల్ల్లుడు నోట్లో శని అన్నట్లుగా మార్కెట్లో వస్తువులున్నారుగానీ కొనుక్కోవటానికి చేతిలో చిల్లిగవ్వ లేక పేద ప్రజలు ఆకలితో చేసిన ఆర్తనాదాలు ఇప్పటికీ బాగా గుర్తు చాలా మందికి. అంత హృదయ విదారకంగా మారిపోయాయి నాటి పరిస్థితులు. అప్పటివరకు చేస్తున్న పనులన్నీ ఒక్కసారిగా ఆగిపోయాయి. భవన నిర్మాణాలు, ఇళ్ల కొనుగోళ్లు, వాహన కొనుగోళ్లు, ప్రయాణాలు, నిత్యావసర వస్తువుల కొనుగోళ్లు... అన్నీ ఆగిపోయాయి బండికి గనక సడ్డెన్ బ్రేకు పడినట్లు. రాజకీయ పార్టీలు ఆందోళన చెయ్యటానికి కూడా డబ్బులు లేని పరిస్థితి. పైగా చెల్లుబాటయ్యే డబ్బుల కోసం గంటల తరబడి బ్యాంకుల ఎదుట నిలబడవలసిన పరిస్థితి కూడా ఉందాయె.
గుర్గావ్లో ఓ వృద్ధుడు రోజు మొత్తం లైన్లో నిలుచున్నా డబ్బు అందక బిగ్గరగా ఏడ్చిన ఏడుపు అందరినీ కలచివేసింది ప్రభుత్వాన్ని నడిపే నాయకులను మినహా. మన ప్రజాస్వామ్య వ్యవస్థ అంతా ప్రజల వెతల పట్ల స్పందించే శక్తిని కోల్పోయిందన్న విషయం అప్పుడు అర్ధమైంది ప్రజలకు. అతను పూర్వం ఎమర్జెన్సీ సమయంలో చూసి వుంటాడు అటువంటి పరిస్థితిని. ఏ ఏటీఎంలో డబ్బులు లేవు. అన్నీ ఖాళీ డబ్బాలే! బ్యాంకుల్లో డబ్బులు కొద్ది మొత్తంలోనే ఇచ్చే వారు, మన అకౌంట్లో డబ్బు వున్నప్పటికీ. ఉన్న వారు లేనివారు అన్న తేడా లేకుండా అందరూ నానా అవస్థలు పడ్డారు డబ్బులకు.
మనం ఎవరినైనా సహాయం అడగాలంటే దీన స్థితిలో ఉన్నట్లు కనిపించాలి ఎదుటివారు జాలి పడే విధంగా. దీనస్థితి అంటే జుట్టు సరిగ్గా దువ్వుకోక, బట్టలు సరైనవి వేసుకోక మొహంలో విచారం కొట్టొచ్చినట్లు కనిపించటం అన్న మాట. ఆ సందర్భంలో నాకు ఒక వింత అనుభవం ఎదురైంది. నేను అప్పుడు ఢిల్లీలో ఉద్యోగం చేస్తున్నాను. హైదరాబాదులో ఇల్లాలేమో మీరు ఏం చేస్తారో నాకు తెలియదు. అర్జెంటుగా ఇరవై వేలు డబ్బులు పంపించమని హుకుం జారీ చేసింది. బ్యాంకుకి చెక్కు పంపించాను ఇరవై వేలు తీసుకురమ్మని. చెక్కు తీసుకొనిపోయిన మనిషి ఆరు వేల రూపాయల కంటే ఇవ్వటంలేదు అని చెక్కు తీసుకొని వెనుక్కు వచ్చాడు.
అది చలి రోజులు. ఢిల్లీలో సూటు బూటు వేసుకునే సీజను. సరే చేసేదేమీ లేక నేను కూడా సూటు బూటు వేసుకొని బ్యాంకు మేనేజర్ దగ్గరకెళ్లి కూర్చున్నాను. ఈయనెవరో పెద్దమనిషిలా ఉన్నాడే అని బ్యాంకు మేనేజరు అనుకోవాలి. తగిన హావాభావాలు ప్రదర్శిస్తూ ఆయన ముందు కూర్చున్నా. అప్పటికి ఆయన చుట్టూ చాలా మంది జనం గుమికూడి వున్నారు. ఆ జనప్రవాహం కాస్త తగ్గాక మేనేజరు నా వైపు చూశారు. మళ్ళీ అలవాటు లేని హావభావాలను ప్రదర్శిస్తూ కాస్త నాజూకైన ఇంగ్లీషులో విషయం బయట పెట్టా: నాకు అవసరంగా ఇరవై వేలు కావాలని. సూటు బూటు భాష పని చేసినట్లున్నరు. ఇరవై వేలు ఇచ్చాడు కాస్త నసుగుతూనే. సరే వచ్చిన పని అయ్యిందిగదా అని వెయ్యి ఏనుగుల బలంతో తిరిగి వచ్చా కార్యాలయం గదికి. ఆ రోజు స్నేహితుడు తెలంగాణ ఎక్స్ప్రెస్లో హైదరాబాద్ వస్తుంటే అతని చేతికి ఇచ్చా ఇరవై వేలు. సికింద్రాబాదులో మనిషి కలుస్తాడు ఇరవై వేలు ఇవ్వమ్మని. మనిషి సికింద్రాబాదులో రైలు పెట్టె దగ్గరకొచ్చి నేను చెప్పిన సీటులో కూర్చున్న మనిషిని అడిగాడు డబ్బులు ఇవ్వండి పలానా మనిషి పంపాడు అని. పెట్టెలో మనిషి చికాకు పడుతూ ఏం డబ్బులు, ఎవరు పంపారు, నాకేమీ తెలియదు పో...అని కసురుకుంటూ చెప్పాడు! ఈ విషయం విని నేను నిర్ఘాంతపోయాను.
స్నేహితుడు అటువంటి వాడు కాదె అని. బాగా తెలిసిన మనిషి. బహుశా వేరే సీటులో ఏమైనా కూర్చున్నాడేమో అని ఫోను చేశా. మరో పది నిమిషాలు పడుతుంది సికింద్రాబాదు చేరటానికి అన్నాడు డబ్బు తీసుకొస్తున్న స్నేహితుడు. అప్పుడు అర్ధమైంది సంగతి. హైద్రాబాదు నుంచి ఢిల్లీ వెళ్లే తెలంగాణ ఎక్స్ప్రెస్ దగ్గరకు వెళ్లి నేను చెప్పిన సీటులో మనిషిని డబ్బులు అడిగాడు స్టేషన్కు వచ్చిన మనిషి... అదే ఢిల్లీ నుంచి వస్తున్న రైలు అనుకొని! ఢిల్లీ నుంచి వచ్చే రైలు 12 గంటలు ఆలస్యంగావటం చేత రెండు రైళ్ళూ దాదాపు ఒకే సమయానికి సికింద్రాబాదు చేరుకున్న పరిస్థితి.
చిత్రమేమిటంటే ఉత్తరప్రదేశ్లో ప్రభుత్వం ఏర్పడిన రోజే ఏటిఎం నుంచి డబ్బులు తీసుకోవటానికి విధించిన పరిమితిని ఎత్తివేసి ఎప్పటిలాగే నలభై వేలు తీసుకునే వీలు కల్పించారు. ఇంత పెద్ద సంచలన నిర్ణయం, కోట్ల ప్రజల జీవితాలను తారుమారు చేసిన నిర్ణయం గురించి...ఏడేళ్ళు గడిచినా దేశానికి ఒనగూడిన ప్రయోజనం ఏమిటో...ప్రధాన మంత్రి నేటికీ చెప్పనేలేదు! నాటి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కాలం చేశారు గనక ఆయన చెబుతారన్న ఆశ లేదు. అవినీతి అంతమొందిందా? నల్లధనం నశించిందా? ఉగ్రవాదం అదుపులోకి వచ్చిందా? ఏవీ ఈ ప్రశ్నలకు సమాధానాలు? కనీసం ఎన్నికల ప్రచారంలో కూడా దాని ప్రస్తావన రావటం లేదు.
(వ్యాసకర్త లోక్సభ సచివాలయంలో మాజీ డైరెక్టర్)
గుమ్మడిదల రంగారావు