bird flu : బర్డ్‌ఫ్లూ వైరస్ మనుషులకు సోకకుండా నిరోధించే జన్యువును కనుగొన్న శాస్త్రవేత్తలు
లండన్ : బర్డ్ ఫ్లూ వైరస్ మనుషులకు వ్యాప్తి చెందకుండా నిరోధించే జన్యువును తాజాగా అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం గుర్తించింది. నేచరల్ జర్నల్‌లో ప్రచురించబడిన అధ్యయనంలో మానవ ప్రొటీన్ బిటిఎన్3ఎ3 బర్డ్‌ఫ్లూను నిరోధిస్తుందని పరిశోధకులు వెల్లడించారు. సాధారణంగా ప్రొటీన్ BTN3A3 మానవ వాయుమార్గంలో వ్యక్తమవుతుందని ఎంఆర్‌సి- యూనివర్సిటీ ఆఫ్ గ్లాస్గో సెంటర్ ఫర్ వైరస్ రీసెర్చ్ (సివిఆర్) నేతృత్వంలోని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ ప్రొటీన్ ఫ్లూకి వ్యతిరేకంగా మానవులకు రక్షణగా నిలుస్తుందని శాస్త్రవేత్తల బృందం తెలిపింది.
కాగా, బర్డ్‌ఫ్లూ బాతులు, పక్షుల నుంచి వ్యాపిస్తుంది. ఈ వైరస్ వల్ల ఎన్నో పక్షి జాతులు అంతరిస్తున్నాయని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ బర్డ్‌ఫ్లూ కేసులు 2022 నుండి పెరుగుతున్నాయి. దీంతో రికార్డుస్థాయిలో పక్షులు చనిపోతున్నాయి. కేవలం పక్షుల మధ్యనే కాదు.. నక్కలు, డాల్ఫిన్‌లు, సముద్ర సింహం, పిల్ల్లుల్లో కూడా ఈ వైరస్ వ్యాపిస్తోంది. అలాగే మనుషులకు కూడా ఈ ఫ్లూ వైరస్ సోకుతోంది. ఈ ఏడాదిలో గడచిన కొద్ది నెలల్లోనే ప్రపంచవ్యాప్తంగా 21 దేశాల్లో 874 బర్డ్‌ఫ్లూ కేసులను గుర్తించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ఈ ఫ్లూ వల్ల ప్రపంచవ్యాప్తంగా 458 మరణాలు సంభవించాయని డబ్ల్యుహెచ్‌ఓ పేర్కొంది. మానవులకు సోకే సీజనల్ వైరస్‌లను ప్రొటీన్ ఎలా నిరోధిస్తుందో.. ఈ బర్డ్‌ఫ్లూనూ కూడా అదేమాదిరిగా నిరోధిస్తుందని ఈ అధ్యయనంలో శాస్త్రవేత్తలు కనుగొన్నారు. వైరస్‌లు నిరంతరం మార్పు చెందుతూ ఉంటాయి. అయితే వైరస్ వ్యాప్తి నియంత్రణలో వైరస్ జన్యుపరమైన నిఘా కీలకం అని సివిఆర్ డైరెక్టర్, ప్రొఫెసర్ మాసిమో పాల్మరి అన్నారు.










