కొలంబో : శ్రీలంకలోని డెంగ్యూ రోగుల్లో దాదాపు 25 శాతం మంది స్కూలుకెళ్ళే పిల్లలేనని ఆరోగ్య అధికారి ఆదివారం తెలిపారు. జాతీయ డెంగ్యూ నియంత్రణా విభాగం డైరెక్టర్ నళిన్ అరియారతనె మాట్లాడుతూ, ఈ ఏడాది ఇప్పటివరకు దేశంలో 42 వేలకు పైగా డెంగ్యూ కేసులు నమోదయ్యాయని చెప్పారు. కొత్త విద్యా సంవత్సరంలో పాఠశాలలు ప్రారంభమవడానికి ఒక రోజు ముందుగా మీడియానుద్దేశించి ఆయన మాట్లాడుతూ, స్కూలు స్థాయిలో డెంగ్యూ వ్యాప్తిని కట్టడి చేయాల్సిన అవసరం వుందని అన్నారు. దాదాపు 50 శాతం కేసులు పశ్చిమ ప్రావిన్స్ నుండి వచ్చాయని చెప్పారు. శ్రీలంకలో ఆ ప్రావిన్స్ అత్యంత జనాభా కలిగిన ప్రాంతమని అన్నారు. ఈ ఏడాది దేశంలో పెద్ద ఎత్తు డెంగ్యూ కేసులు పెచ్చరిల్లుతాయని ఆరోగ్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని అన్నారు. గతేడాదిలో దేశంలో 76 వేల డెంగ్యూ కేసులు నమోదైనట్లు అధికారిక డేటా తెలిపింది.










