Oct 09,2023 11:58

జడ్చర్ల రూరల్‌ (మహబూబ్‌నగర్‌) : స్కూల్‌ బస్సును లారీ ఢీకొట్టడంతో 28మంది విద్యార్థులకు గాయాలైన ఘటన సోమవారం మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల మండలం కొత్తతండా సమీపంలో జరిగింది. ఓ ప్రైవేటు స్కూల్‌ బస్సు విద్యార్థులతో జడ్చర్ల నుండి మహబూబ్‌నగర్‌కు బయలుదేరింది. కొత్త తండాలో స్కూల్‌కు సమీపాన ఓ మలుపు వద్ద యూటర్న్‌ తీసుకుంటుండగా బస్సును వెనుక నుంచి వచ్చిన లారీ అదుపుతప్పి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 28 మంది విద్యార్థులు గాయపడ్డారు. గమనించిన స్థానికులు వెంటనే సహాయకచర్యలు చేపట్టారు. గాయపడిన విద్యార్థులందరినీ మహబూబ్‌నగర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. గాయపడిన విద్యార్థుల్లో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. సమాచారం అందుకున్న జిల్లా విద్యాధికారి రవీందర్‌, పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.