Jun 28,2023 14:57

వరల్డ్‌కప్‌ క్వాలిఫయర్స్‌-2023లో అద్భుతమైన ప్రదర్శనలతో ఐసీసీ తాజాగా విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్‌లో జింబాబ్వే ఆల్‌రౌండర్‌ సికందర్‌ రజా, విండీస్‌ బ్యాటర్‌ నికోలస్‌ పూరన్‌ సత్తా చాటారు. పూరన్‌ టాప్‌ 20లోకి (19వ స్పాట్‌)లోకి రాగా, సికందర్‌ రజా 7 స్థానాలు మెరుగుపర్చుకుని 27వ ప్లేస్‌కు ఎగబాకాడు. వరల్డ్‌కప్‌ క్వాలిఫయర్స్‌లో బంతితోనూ సత్తా చాటిన సికందర్‌.. ఆల్‌రౌండర్ల విభాగంలోనూ రెండు స్థానాలు మెరుగుపర్చుకుని మూడో ప్లేస్‌కు చేరాడు. బౌలింగ్‌లో 4 మ్యాచ్‌ల్లో 18 వికెట్లతో చెలరేగిన లంక స్పిన్నర్‌ వనిందు హసరంగ 2 స్థానాలు మెరుగుపర్చుకుని 24వ ప్లేస్‌కు చేరగా.. జింబాబ్వే పేసర్‌ రిచర్డ్‌ నగరవ 27 స్థానాలు మెరుగుపర్చుకుని 32వ స్థానానికి ఎగబాకాడు.
కాగా బ్యాటింగ్‌, బౌలింగ్‌ విభాగంలో టాప్‌-10 స్థానాల్లో మాత్రం ఎలాంటి మార్పులు లేవు. బ్యాటింగ్‌లో బాబర్‌ ఆజమ్‌, బౌలింగ్‌లో హాజిల్‌వుడ్‌ అగ్రస్థానాల్లో కొనసాగుతున్నారు. భారత్‌ నుంచి బ్యాటింగ్‌ విభాగంలో శుభ్‌మన్‌ గిల్‌, విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మ టాప్‌ 10లో ఉండగా.. బౌలింగ్‌లో సిరాజ్‌ ఒక్కడే టాప్‌-10లో కొనసాగుతున్నాడు.