వాకాడు మండలంలోని తీర ప్రాంత గ్రామం వల్లమేడు. ఈ గ్రామం లోని మండల పరిషత్ ప్రాథమిక కొన్నత పాఠశాలలో 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు 67 మంది విద్యార్థులు వున్నారు. ప్రభుత్వ పాఠశాలలో ప్రస్తుతం అమలులో ఉన్న నిబంధనల మేరకు విద్యార్థులకు ఆ పాఠశాలలో ఒక ప్రధానోపాధ్యాయుడు, ముగ్గురు ఉపాధ్యాయులు ఉండాలి. అయితే నేడు ఆ పాఠశాలలో ఒక ప్రధానోపాధ్యాయడు, ఒక ఉపాధ్యాయిని మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. ప్రధానోపాధ్యాయులు పాఠశాల పర్యవేక్షణ, మధ్యాహ్న భోజనం, విద్యార్థులు హాజరు రికార్డులు, పాఠశాల సమాచార నివేదికను అధికారులకు పంపడానికే ఎక్కువ సమయం ఖర్చయిపోతోంది. ఒకటో తరగతి నుండి 8వ తరగతి వరకు దాదాపు 40 సబ్జెక్టులను పాఠ్యంశాల వారీగా చెప్పడానికి ఒక ఉపాధ్యాయుని మీద అధిక భారం పడుతోంది. దాంతో తరగతుల వారీగా బోధన పాఠ్యప్రణాళికల ప్రకారం జరగటం లేదని, అందుకు కారణం ఉపాధ్యాయుల కొరత అని, విద్యార్థులు తరగతికి తగిన విధంగా విద్యలో పురోగతి లేదని, విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదనను వ్యక్తపరుస్తున్నారు. గతంలో పాఠశాలలో సంపూర్ణ స్థాయిలో ఉపాధ్యాయులు ఉండటంతో విద్యార్థుల సంఖ్య 80 నుంచి 100 మధ్య ఉండేది. అయితే ఉపాధ్యాయుల కొరత, విద్యార్థుల వెనుకబాటుతనాన్ని గుర్తించిన తల్లిదండ్రులు తమ పిల్లలను బయటి ప్రాంతాల పాఠశాలలో చేర్పించుకున్నారు. ఇలాగే కొనసాగితే తమ పాఠశాల ఉనికిని కోల్పోతుందని ప్రాథమిక స్థాయిలోనే ఈ పేద బిడ్డలు భవిష్యత్తు కాలరాయపడుతుందని గ్రామస్తులు కూడా ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం 'నాడు-నేడు' కార్యక్రమంతో పాఠశాలలో భౌతిక వనరులు సమకూర్చి భవనాలను మెరుగుపరిచింది. మంచి పౌష్టికాహారం, వసతులు కల్పించింది. అయితే పాఠశాలలో చదువుకుంటున్న గిరిజన, హరిజన పేద పిల్లలను ప్రతిభావంతులైన విద్యార్థులుగా మాత్రం చేయడంలేదు. టీచర్లను నియమించి తమ పిల్లల భవిష్యత్తుకు న్యాయం చేయాల్సిందిగా తల్లిదండ్రులు ప్రభుత్వాన్ని, అధికారులను కోరుకుంటున్నారు.
- మస్తాన్ కమతం, వల్లమేడు, నెల్లూరు జిల్లా.










