Sep 23,2023 21:50
  •  మూడో రోజు కొనసాగిన దళిత రక్షణ చైతన్య యాత్ర

ప్రజాశక్తి - పశ్చిమగోదావరి యంత్రాంగం : దళితులకు రక్షణగా ఉన్న ఎస్‌సి, ఎస్‌టి సబ్‌ప్లాన్‌ చట్టాన్ని పగడ్బందీగా అమలు చేయాలని కెవిపిఎస్‌ పశ్చిమగోదావరి జిల్లా కార్యదర్శి కె.క్రాంతిబాబు డిమాండ్‌ చేశారు. కెవిపిఎస్‌, వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో పశ్చిమగోదావరి జిల్లాలో చేపట్టిన దళిత రక్షణ యాత్ర మూడో రోజు శనివారం ఆచంట, పెనుగొండ, ఇరగవరం, తణుకు, తాడేపల్లిగూడెం మండలాల మీదుగా పెంటపాడు వరకు సాగింది. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో ప్రజాసంఘాల నేతలు, దళితులు, కార్మికులు యాత్రకు ఘనస్వాగతం పలికారు. తమ సమస్యలతో కూడిన వినతిపత్రాలు యాత్ర బృందానికి అందించారు. ఈ సందర్భంగా కెవిపిఎస్‌ జిల్లా కార్యదర్శి కె.క్రాంతిబాబు, ఎపి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి జక్కంశెట్టి సత్యనారాయణ మాట్లాడుతూ పోరాడి సాధించుకున్న ఎస్‌సి, ఎస్‌టి సబ్‌ప్లాన్‌ చట్టాన్ని పాలకులు నీరుగారుస్తున్నారని మండిపడ్డారు. దళితులపై దాడులు గతంలో ఎన్నడూ లేనంతగా పెరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలను అంబానీ, అదానీ వంటి కార్పొరేట్లకు కట్టబెట్టి దేశ సంపదను కొల్లగొడుతున్నారని విమర్శించారు. అంబేద్కర్‌ ఇచ్చిన రాజ్యాంగ హక్కులను ఐక్య ఉద్యమాలతోనే కాపాడుకుంటామన్నారు. రాష్ట్రంలో ఉన్న మిగులు భూములను దళితులకు తక్షణమే పంచాలని డిమాండ్‌ చేశారు. యాత్రలో కెవిపిఎస్‌, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు బత్తుల విజయకుమార్‌, బాతిరెడ్డి జార్జి, ప్రజానాట్యమండలి జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బి.చైతన్య ప్రసాద్‌, షేక్‌ వలీ, సిఐటియు జిల్లా కార్యదర్శి డి.కల్యాణి తదితరులు పాల్గొన్నారు.