ప్రజాశక్తి - రాజమహేంద్రవరం ప్రతినిధి :టిడిపి అధినేత నారా చంద్రబాబునాయుడిని కలిసేందుకు ఆయన భార్య భువనేశ్వరి ములాఖత్ కోసం పెట్టుకున్న దరఖాస్తును జైలు అధికారులు శుక్రవారం తిరస్కరించారు. రిమాండ్‌లో ఉన్న ఖైదీని న్యాయవాది మినహా మిగిలిన వారు కలుసుకునేందుకు వారంలో రెండు ములాఖత్‌లకు మాత్రమే అవకాశం ఉంటుంది. న్యాయవాదులకూ కొన్ని నిబంధనల మేరకే ప్రత్యేక ములాఖత్‌లు ఉంటాయి. చంద్రబాబు కుటుంబ సభ్యులు ఈ నెల 11న లోకేష్, బ్రాహ్మణి, భువనేశ్వరి ములాఖత్ తీసుకున్నారు. 15న లోకేష్, పవన్‌కల్యాణ్, బాలకృష్ణ ములాఖత్ అయ్యారు. నిబంధనల ప్రకారం రెండు ములాఖత్‌లు అయిపోవడంతో భువనేశ్వరి దరఖాస్తును జైలు అధికారులు తిరస్కరించినట్టు సమాచారం. రెండు ములాఖత్‌లు ముగిసిపోతే తరువాత ములాఖత్ ఇచ్చేది లేనిదీ పూర్తిగా జైలు సూపరింటెండెంట్ పరిధిలో ఉంటుంది. వ్యక్తిగత కారణాల రీత్యా రాజమండ్రి సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ ఎస్.రాహుల్ మూడు రోజులపాటు సెలవులో ఉన్నారు. ఆయన గురువారం మధ్యాహ్నామే సెలవుపై వెళ్లిపోయారు. ప్రస్తుతం జైళ్ల శాఖ డిఐజి రవికిరణ్ పర్యవేక్షణ చేస్తున్నారు.










